10, జనవరి 2009, శనివారం

చిలుక పరకాయప్రవేశం – 3

(నిన్నటి కధ తరువాయి బాగం)

మణివేగుడు చిలుక రూపంలో ఉన్న విక్రమార్కుడిని కొనుక్కున్నాడు.

మణివేగుడి తండ్రి చర్చకు పిలిచిన పెద్దమనుషులందరూ కలిసి మణివేగునికి ఒక అంగడి ఇచ్చారు. తరవాత మణివేగుడు ఒక నవరత్న ఖఛిత పంజరం చేయించి ఆ చిలుకని అందులో ఉంచాడు. రోజూ పాలూ, పండ్లూ ఇతర తిండిపదార్ధాలూ చిలుకకి పెట్టేవాడు.

ఒకరోజు చిలుకలోని విక్రమార్కుడు మణివేగునితో ఇలా అన్నాడు,
"శెట్టిగారూ! నాకో ఆలోచన వచ్చింది. ఇక నుండి మీరు ఊరికినే కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకోండి. వ్యాపారం నేను చేస్తాను. మీ అంగడిలోని పనివారిని అందరిని నా మాట వినేటట్లు జేయండి. ఖాతాదార్లు వచ్చినప్పుడు మీరేమీ బేరాలాడక హాయిగా కూర్చోని, నేను వారితో చేయు బేరాలు చూడండి.”

ఈ సలహా ఎంతో నచ్చడం వల్లన మణివేగుడు అలానే చేసాడు. విక్రమార్కుడు తన తీయని మాటలతో వేరే దుకాణాలకు వెళ్ళే వాళ్ళను కూడా వీళ్ళ అంగడికే రప్పించసాగాడు. అందువల్ల మణివేగుడు కొంత కాలంలోపే ఎంతో డబ్బు గడించాడు.

ఆ ఊరిలో రత్నవల్లి అనే ఒక నర్తకి ఉండేది. ఆ నర్తకీ గొప్ప అందగత్తె, అంతేగాక చాలా గొప్పగా నాట్యం చేయగలదు. రత్నవల్లి నాట్యం చూడడానికి రాజు కొడుకు, మంత్రి కొడుకు, శెట్టి కొడుకు మన మణివేగుడు ఇంకా ఎంతో మంది గొప్ప ధనవంతులు వంతుల వారీగా వెళ్ళేవాళ్ళు. దాంతో ఆ నర్తకీకి పొగరెక్కింది. ఆ పొగరుతో రత్నవల్లి ఎవరికైనా తను కలలో కనిపించినా కూడా తనకు 1000 హొన్నులు చెల్లించాలని శపధము పెట్టింది. ఆమె కలలోకి వచ్చిందని చెప్పుకోకపోతె ఏ గొడవ ఉండదు. కానీ అంతటి సౌందర్యవతి కలలోకి వచ్చిందని ఎలా చెప్పకుండా ఉంటారు? చెప్పకుండా ఉండలేక పోయేవారు. చెప్పుకున్నాక ధనవంతులైతే మారుమాట్లాడక ఇచ్చేవారు.

ఒక నాడు ఒక పేదబాపనికి రత్నవల్లి కలలో వచ్చింది. గొప్పకోసం వాడు స్నేహితులతో చెప్పుకున్నాడు. దాంతో అది రత్నవల్లికి తెలిసింది. వాడిని పిలిపించి తనకు ఇవ్వవలసిన 1000 హొన్నులు ఇవ్వమంది.వాడు తను పేదవాడినని డబ్బు ఇచ్చుకోలేనని, ఈ సారికి వదిలేయమని ఎంత బ్రతిమాలినా రత్నవల్లి ఒప్పుకోలేదు.

అందువల్ల వాడు దిగాలుగా మణివేగుని దుకాణం ముందుకూర్చుని ఆలోచించసాగాడు. ఐతే విక్రమార్కుడు, "బ్రాహ్మణోత్తమా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు?" అని అడిగాడు.

ఆ బ్రాహ్మణుడు చెప్పింది విని, విక్రమార్కుడు “నువ్వేమీ బాధపడకు. ఆమె తిక్క నేను కుదురుస్తాను. నేను డబ్బులిస్తానని చెప్పి ఆమె నిక్కడకు తీసుకురా” అని చెప్పాడు.

ఆ బ్రాహ్మణుడు రత్నవల్లిని తీసుకొచ్చాడు. విక్రమార్కుడు 1000 హొన్నులను అద్దంలో చూపించి,
"ఓ నర్తకీ మణి! ఈ బ్రాహ్మణుడు నిన్ను కలలో చూసాడే గానీ నిజంగా కాదు, కాబట్టి నువ్వు కూడా ఈ అద్దంలోంచి డబ్బు తీసుకో” అని చెప్పాడు.

జనం అంతాకూడా “నిజం, నిజం” అంటూ చిలుకని మెచ్చుకున్నారు. దాంతో ఆ నర్తకి సిగ్గుపడి “నిన్నెలాగైనా చంపి తింటాను చూస్కో” అంటూ విక్రమార్కుడి మీద శపధం చేసింది.

ఆ రోజు మణివేగుని వంతు అందుకని మణివేగుడు రత్నవల్లి ఇంటికి వెళ్ళాడు. ఐతే తలుపులు మూసేసి ఉన్నాయి. “ఎందుకని ద్వారాలు మూసారు” అని మణివేగుడడగగా రత్నవల్లి చెలికత్తెలు “రత్నవల్లికి దేనిపైనో మనసు పడిందంట అది దొరికితేగానీ మిమ్ములని లోపలికి అనుమతించదట” అని చెప్పారు.

"ఏమిటది? ఏదైనా సరే ఇస్తాను, చెప్పు” అని మణివేగుడు బ్రతిమాలగా

"ఏదైనా సరే ఇస్తారా? మాటతప్పరుగా?" అని అడిగింది రత్నవల్లి.

"ఏదైనా సరే ఇస్తాను. అడుగు” అన్నాడు మణివేగుడు.

"ఐతే మీ చిలుకపై నేను మనసు పడ్డాను. అది తీసుకు రండి” అని చెప్పింది.

"అంత చిన్నవిషయానికా ఇంత రాధ్దాంతం. ఇప్పుడే తెస్తాను” అంటూ ఇంటికెళ్ళి విక్రమార్కుణ్ణి తీసుకొని హడావుడీగా రత్నవల్లి ఇంటికి వెళ్ళాడు.

విక్రమార్కుడికి విషయం అర్ధం అయ్యింది. ‘వీడికి తిక్క తలకెక్కినట్టుంది. అందుకే ఈ తిక్క పని చేస్తున్నాడు’ అని యోచిస్తుండగా రత్నవల్లి ఇంటిని చేరుకున్నారు.

రత్నవల్లి చిలుకని జాగ్రత్తపరిచి. తన నాట్యంతో మణివేగుణ్ణి రంజింపజేసి పంపేసింది. మరునాడు పొద్దున్నే చిలుకతో “చూసావా నా మాట నెగ్గించుకో బోతున్నాను” అంటూ రత్నవల్లి చిలుకను వంట మనిషికి ఇచ్చి “దీన్ని కూర చేయ్యి. మధ్యానం తింటాను” అని చెప్పింది.

వంటమనిషి పంజరంలో నుంచి విక్రమార్కుణ్ణి తీసి చంపబోయింది. కానీ విక్రమార్కుడు దాని చేతిని కొరికి గాలిలోకి ఎగిరిపోయాడు. ఈ విషయం తెలిస్తే తన యజమానురాలు తనను ఏమంటుందో అని బజారుకి వెళ్ళి ఆ వంటమనిషి ఇంకో చిలుకని తీసుకు వచ్చి కూర చేసింది. రత్నవల్లి విక్రమార్కుడినే వంటమనిషి కూరచేసిందనుకుని, గర్వంగా చిలుకను తిడుతూ కూర తిన్నది.

విక్రమార్కుడు రత్నవల్లిని ఎలా అవమానిస్తాడో, ఎలా ఏడిపిస్తాడో తరవాత టపాలలో ………

2 కామెంట్‌లు:

Aruna చెప్పారు...

Present template is better than the earlier one. I am able to read happily as the background color is white.

Unknown చెప్పారు...

ఇప్పుడున్న టెంప్లేటు బాగుంది మునుపటి హారీపోటరు కన్నా....
చదవడానికి ఇబ్బంది లేకుండా ఉంది.
విజయోస్తు