ఈ రాజకీయ దారుణాలని నేను చూడలేనబ్బా!
(నిన్నటి కధ తరువాయి భాగం)
మతిమంతుడు ఎనుబోతుగా మారాడని తెలియక అక్కడ మనోరమ అతను వస్తాడు అనుకుని ఎదురుచూడసాగింది. ఎంతసేపటికీ అతను రాలేదు. కొంత సేపటికి ప్రసవ వేదనతో ఆమె అరిచిన అరుపులకు చుట్టు పక్కల ఇళ్ళ స్త్రీలు వచ్చి, ఆమె పరిస్థితి గమనించి వెంటనే మంత్రసానిని పిలిపించారు. మనోరమకి ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆమె కొన్ని రోజులు ఎదురుచూసింది. కానీ మతిమంతుడు రాలేదు. దాంతో ఆమె రాజుగారి దగ్గరకి వెళ్ళి, తను ఎవరో మాత్రం చెప్పుకోకుండా తన కధ మొత్తం చెప్పి తన భర్తని వెతికిపెట్టమని కోరింది.
ఆ దేశపు మంత్రి దేశం అంతా వెతికించాడు. కానీ కనిపెట్టలేక పోయారు. అందులో వారి తప్పేముంది? మనిషి రూపంలో ఉంటే కదా వాళ్ళు కనిపెట్టటానికి! వాళ్ళు మనోరమతోటి “తల్లీ! నీ భర్త దొరకలేదు. ‘కానీ నువ్వు ఇప్పుడు నీ గతి ఏమిటీ?’ అని బాధ పడకు. మా కోశాగారం నుంచీ, మా ఖజానా నుంచీ నీకు ప్రతి నెలా అన్నీ అవసరాలు తీరే విధంగా అన్నీ అందేలా చూస్తాము. ఆ సదుపాయాలతో నువ్వు సుఖంగా ఉండవచ్చు” అని చెప్పాడు రాజు.
కానీ ఆమె ఒప్పుకోకుండా. ఇలా బదులు చెప్పింది “ఓ మహారాజా! మీరు నాపై చూపిన దయకి కృతఙ్ఞురాలిని. కానీ నా భర్తకి నేనంటే ఎంతో ఇష్టం. అలాంటిది గర్భవతినైన నన్ను విడిచి వేరే ఊరికి ఎట్టి పరిస్తుతుల్లో పోరు. అలాంటప్పుడు ఈ ఊరిలోనే ఉంటే ఆయన తప్పకుండా మీకు దొరికేవాడు. రెండూ జరగలేదు అంటే తప్పకుండా ఆయన చనిపోయి ఉంటారు. భర్త చనిపోయాక భార్యగా నేను బ్రతికి ఉండీ లాభం ఏమిటీ? నేను ఎవరినైతే నా జీవితంగా భావించానో ఆ వ్యక్తి నాకు దూరం అయ్యారు. కనుక నేనే ఆయన వద్దకు వెళ్ళాలి. కనుక దయచేసి నాకు ఈ రోజు సాయంత్రం చితి పేర్పించండి” అని అన్నది. రాజు మిగతా సభకులు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇంక రాజు చితి పేర్పించమని ఆఙ్ఞ జారీ చేసాడు. ఈ విషయం ఊరంతా పాకింది.
ఐతే ఇక్కడ ఈ నర్తకీ ప్రతి రోజూ రాత్రికి మతిమంతుడిని మనిషిగా చేస్తుంది. మళ్ళీ పొద్దునకి ఎనుబోతుగా మార్చేస్తుంది. పాపం! మతిమంతుడికి ఏమో ఆ మందు ప్రభావమో లేక పొద్దునంతా ఎనుబోతుగానూ రాత్రంతా మనిషిగానూ మారటం వల్లనో అంతా అయోమయంగా ఉండేది. అసలు తను ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులే తెలిసేవి కాదు. ఇలా ఇతని జీవితం సాగుతుండగా ఆ నర్తకికి ఎవరో ఒకావిడ భర్త చనిపోయాడని తెలుసుకుని ఆ బాధతో ఆత్మాహుతి చేసుకోబోతుందని తెలిసింది. ఊరు ఊరంతా ఆ విశేషం ఏమిటో చూడాలని వెళ్తున్నారని, ఆ నర్తకీ కూడా బయలుదేరింది. కాకపోతే సరే ‘ఈ వింత ఏమిటో తను కూడా చూస్తాడు. తనని కూడా తీసుకెళ్దాం’ అని భావించి ఆమె మతిమంతుడిని కూడా మనిషిని చేసి తీసుకెళ్ళింది.
ఐతే వాళ్ళు వెళ్ళే సరికి మనోరమ చితి చుట్టూ అప్పటికే మూడో ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఆమెని చూడగానే మతిమంతుడికి తన గతం అంతా గుర్తుకు వచ్చింది. వెంటనే జరిగింది ఏమిటో కూడ అర్ధం అయిపోయింది. ఐతే మతిమంతుడు మన సినిమాలలో హీరోలలాగా మతిలేని వాడు కాదు. అగ్నిలో దూకబోతున్న భార్యని ఆపడానికి బదులు ఆ నర్తకిని చంపడమొ లేక తన్నడమో చేయడానికి! అందువల్ల అతను “నేను బ్రతికే ఉన్నాను. నువ్వు అగ్నిలో దూకద్దు” అంటూ అరుస్తూ మనోరమ దగ్గరికి పరిగెత్తాడు. ఐతే మనోరమ దృష్టి చుట్టూ జరుగుతున్న వాటిమీద అస్సలు లేకపోవడంతో, ఆమెకి ఆ మాటలేవీ వినిపించ లేదు. ఆమె అగ్నిలో దూకేసింది. అది చూడగానే భరించలేక అతను కూడా అగ్నిలో దూకేసాడు. నా మూలంగా ఇద్దరు చనిపోయారే అని నర్తకీ కూడా అగ్నిలో దూకింది. అది చూసి ‘అయ్యో మతిమంతుడు ఈ ఊరిలోనే ఉన్నా, అతన్ని వెతికి పట్టుకోలేక పోయానే’ అన్న భాదతో మంత్రి కూడా అగ్నిలో దూకాడు. ఇదంతా చూసిన రాజు తట్టుకోలేక, మహాంకాళి గుడికెళ్ళి, “అమ్మా! కాళికా మాతా! నా దేశంలో బ్రతకడానికి వచ్చిన ఇద్దరు పరదేశస్తులను నా మంత్రినీ ఆ నర్తకినీ బ్రతికిస్తావా లేక నన్ను కూడా ఆత్మాహుతి చేసుకోమంటావా?" అని అమ్మవారిని స్తుతించాడు. అప్పుడు అమ్మవారు అందరినీ బ్రతికించింది.
ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప?"అని రవిక అడిగింది.
ఆ ప్రశ్నకు విక్రమార్కుడు ఈ సారికూడా పలుకని పడంతిని మాట్లాడించడం కోసం కావాలనే “ఓ రవికా! మంత్రి చనిపోవడమే గొప్ప” అని సమాధానం చెప్పాడు.
ఆ సమాధానం విన్నవెంటనే పలుకని పడంతి “ఏమిటయ్యా ఈ తప్పుడు సమాధానాలు? మంత్రి చనిపోవడం గొప్ప కాదు. ఆ నర్తకీ చనిపోవడం గొప్ప. ఎందుకంటే నర్తకీ అన్నాక డబ్బు, సుఖం తప్ప ఇంకేమీ పట్టవు. అలా అయ్యుండీ కూడా ఆమె వారి కోసం చనిపోయిందంటే అదీ గొప్ప” అని సరైన సమాధానం చెప్పింది.
అప్పుడు విక్రమార్కుడు ‘అయ్యో! ఆడవారికి తెలిసినది మనకు తెలియలేదు కదా!’ అని చింతించాడు[?]
అప్పుడు పలుకని పడంతి ‘ఆహా! మగవారికి తెలియనిది మనకు తెలిసెను కదా!’ అని సంతసించింది.
ఈ సారి విక్రమార్కుడు పలుకని పడంతి పయ్యెదని “ఓ చీర కొంగూ! పలుకని పడంతి ఏమో మాట్లాడటం లేదు. పొద్దేమో పొడవడం లేదు. నాకేమో నిద్ర రావడం లేదు. నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా!” అని అడిగాడు.
వెంటనే భేతాళుడు పమిట కొగులో ప్రవేశించి, "చాల్చాల్లే పోవయ్యా! భలే అడిగావు. ఇక్కడ ఈ చిన్నదేమో నా మీద వడ్డాణాలూ, నగలు అంటూ అవీ ఇవీ పెట్టుకుంది. దాంతో నాకు గాలాడక నేను భాద పడుతుంటే. ‘రోలు ఒచ్చి డోలుకు చెప్పుకున్నట్టు’ నువ్వు నన్ను కధ అడుగుతున్నావా? అసలు నీకిది న్యాయమా?” అని అన్నాడు.
వెంటనే పలుకని పడంతి చీర మార్చుకుని వచ్చింది. ఈ భేతాళుడు ప్రవేశించిన చీరని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టింది.
(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)
(నిన్నటి కధ తరువాయి భాగం)
గుడిలోకి వెళ్ళిన తంత్రలోహనుడు వెతకగా ఉత్తరదిశలో ఉన్న అమ్మాయి బొమ్మ దగ్గర మదనమోహనుడి ప్రలాపాలను చూసాడు.
మదనమోహనుడికి ఎంత చెప్పినా కూడా, ఆ విగ్రహన్ని, ‘నిజం అమ్మాయేనని’ నమ్ముతున్నాడే గానీ బొమ్మ అని నమ్మటం లేదు.
చివరికి తంత్రలోహనుడికి విసుగు పుట్టింది. సరే అనుకుని ఆ గుడి పూజారి దగ్గరకెళ్ళి, "అయ్యా! అక్కడున్న ఆ విగ్రహంని ఎవరు చెక్కారు? దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?" అని అడిగాడు.
పూజారి “నాయనా! ఇక్కడికి 10 ఆమడల దూరాన సంగమేశ్వరీ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కోదండుడనే శిల్పాచారి ఉన్నాడు. అతను సంవత్సరం కొకసారి ఈ గుడికి వచ్చి పూజలు చేసి వెళ్తుంటాడు. అతనే ఆ శిల్పాన్ని చెక్కాడు” అని చెప్పాడు.
"స్వామీ! నేను తిరిగి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పటి వరకూ నా మిత్రుడి అవసరాలు మీరే చూడాలి” అని చెప్తూ తన మెడలోని నవరత్న ఖచితమైన మాలికని తీసి అతని చేతికిచ్చాడు.
తంత్రలోహనుడు కోదండుడి దగ్గరకెళ్ళి “శిల్పాచార్యా! మందాకినీ పురం పరిసరాలలోని అడవిలోని గుడిలో ఒక అందమీన అమ్మాయి శిల్పాన్ని మీరు చెక్కారట. ఆ శిల్పాన్ని ఏ అమ్మాయిని చూసి చెక్కారు?" అని అడిగాడు.
"మానవోత్తమా! ఒక నెల క్రితం సూర్యాస్తమయం అయ్యాక ఒక కుమ్మరి నా దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో ఒక వజ్రం ఉంది. నిజానికీ ఆ వజ్రం ఇంద్రధనస్సులోని అన్ని రంగులనూ వెదజల్లుతూ చాలా అద్భుతంగా ఉంది. నేను నా కూతురి మెడలోని గొలుసు ఆ కుమ్మరికి ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకున్నాను. కానీ తెల్లారాక చూస్తే అది వజ్రం కాదు, గోరు. ఇంకేం చేస్తాను, శిల్పశాస్త్రం ప్రకారం ఆ గోరును చూసి మనిషిని ఊహించి వేసే అపూర్వ విద్య నాకు తెలుసు. ఆ విద్యప్రకారం ఆ శిల్పం చెక్కాను” అని చెప్పాడు.
తంత్రలోహనుడు కుమ్మరి వాడి చిరునామా కనుక్కుని, కుమ్మరి వాడిని కలిసాడు. “అయ్యా! మీరు కోదండుడు అనే శిల్పికి ఒక గోరును వజ్రం అని చెప్పి అమ్మారట కదా! ఆ గోరు మీకు ఎక్కడిది?” అని అడిగాడు.
ఆ ప్రశ్నకు కుమ్మరి వాడు “అయ్యా! అది ఎంత భాదాకర సంఘటనో మీకు తెలియదు. అడవిలోంచి ఎవరో ఒక వేటగాడు వచ్చాడు. ఆ రాత్రి వేళ, నేను ఎలాగైతే శిల్పాచార్యుణ్ణి మోసం చేసానో అదే విధంగా వాడు ఆనాడు నన్ను మోసం చేసి, నాకు ఆ గోరుని అంటగట్టాడు. నా కూతురికి చక్కని గొలుసు చేయించి అందులో వజ్రాన్ని పొదుగించుకుందాం అనుకుని. నేను వాడి దగ్గర ఆ గోరుని తీసుకుని ఎన్నో కుండలు, పిడతలు ఇంకా ఏవేవో వస్తువులు ఇచ్చాను. మర్నాడు చూస్తే అది మామూలు గోరు. ఇంక ఏం చేయాలో పాలుపోక వాడు నన్ను ఎలా మోసం చేసాడో నేనూ అదే విధంగా శిల్పాచారిని మోసం చేసాను. కాకపోతే ఆయనకి నేను ఏ ఊరి నుండి ఆయన దగ్గరకు వచ్చానో తెలుసుగానీ నా ఇల్లేదో నేను చెప్పలేదు. మీకు ఎలా తెసింది?” అని అడిగాడు.
తంత్రలోహనుడు “బాబూ! ఆయన నాకు మీ ఊరి పేరు మాత్రమే చెప్పారు. నేను అతికష్టం మీద వాకబు చేసి మీ చిరునామా తెలుసుకున్నాను” అని చెప్పాడు.
తరవాత వేటగాడి గురించి వాకబు చేసి తంత్రలోహనుడు అతన్ని కలిసాడు. “వేటగాడా! కుమ్మరి వాడికి నీవు ఒక గోరును వజ్రం అని అభద్ధం చెప్పి అమ్మావు. ఆ గోరు నీకు ఎక్కడిది?” అని అడిగాడు.
"అయ్యా! నేను కొన్నాళ్ళ క్రితం అడవిలోకి వేటకి వెళ్ళాను. కానీ ఒక్క జంతువూ దొరకలేదు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఒక చెట్టు క్రింద విశ్రమించాను. అలా నిద్రపోయిన నాకు మెలుకువ వచ్చేటప్పటికి రాత్రి అయ్యింది. చూస్తే నా కంటి ఎదురుగా ఒక ప్రజ్వులితమైన వజ్రం కనిపించింది. ఆ వజ్రాన్ని నా యింటికి తీసుకెళ్ళాను. కానీ తెల్లారాక చూస్తే అది ఒక మామూలు గోరు. నేను ఆ గోరుని మోసం చేసి కుమ్మరి వాడికి అమ్మాను” అని తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు.
కానీ ఇప్పుడు తంత్రలోహనుడికి కావలసింది వాడు తప్పు ఒప్పుకోవటం కాదు కనుక, ఆ విషయాన్ని పక్కన పెట్టి అతనికి గోరు దొరికిన చెట్టు దగ్గరికి వెళ్ళి విశ్రమించాడు. అప్పటి దాకా ఎవరినో ఒకరిని ఆ గోరు గురించి అడిగి తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అడగడానికి ఎవరూ లేరు కదా! అందుకని దిగాలుగా కూర్చున్నాడు. ఐతే ఆ చెట్టు మీద ఒక చిలుకల గుంపు నివసిస్తుంది. ఆ గుంపుకి ఒక రాజు కూడా ఉన్నాడు. మొత్తం 1000 చిలుకలకి రాజు ఐన సురేంద్రుడు తంత్రలోహనుడిని చూసి “మానవేంద్రా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు? అసలు ఇంత రాత్రి ఇక్కడ ఎందుకున్నావు? ఈ అడవిలో ఎన్నో కౄర మృగాలుంటాయి. కనుక నీవు వాటి కంట పడకముందే ఇక్కడి నుండి దగ్గరలో ఉన్న ఏదైనా పట్టణానికి వెళ్ళిపో” అని చెప్పింది.
తంత్రలోహనుడు తను ఎందుకు అక్కడికి వచ్చింది, అసలు మొత్తం ఏం జరిగిందీ అంతా చెప్పాడు.
(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)