19, డిసెంబర్ 2008, శుక్రవారం

రేచుక్క పగటి చుక్క - 5

(నిన్నటి కధ తరువాయి భాగం)

మృధు మధురమైన కంఠంతో యువరాణి ఇలా అన్నది.

"నాన్నగారూ! ఈ దొంగ చాలా తెలివైన వాడిలా ఉన్నాడు! వీళ్ళంతా అతన్ని పట్టుకోలేరు. మీరు అనుమతిస్తే, నేను పగటి చుక్కని పట్టుకుంటాను” అన్నది యువరాణి.

"నీ మీద నాకా నమ్మకం ఉందమ్మా! సరే, నీ యిష్టం” అన్నాడు రాజు.

పగటి చుక్కకి కూడా చాలా ఉత్సాహంగా అనిపించింది. రహస్యంగా యువరాణిని అనుసరించసాగాడు పగటి చుక్క.
దర్బారు ముగిసాక యువరాణి చెలికత్తె, "యువరాణీ! ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నించి ఇంత మంది విఫలమయ్యారు కదా! మీరు ఎలాగ పట్టుకుంటారు?” అని అడిగింది.

ఆ మాటకి యువరాణి ఒక చక్కని నవ్వు నవ్వి. “అతన్ని పట్టుకోవటానికి మనం ఇన్ని ప్రయత్నాలు చేసాం. కానీ పగటి చుక్క తప్పించుకున్నాడు. అంటే ఖచ్చితంగా అతను మన రాజ దర్బారులో జరిగే విషయాలన్నీ ఎప్పటికి అప్పుడు తెలుసుకుంటున్నాడు అన్నమాట. ఈ రోజు నేను మన రాచతోటలో ఒక్కదాన్నే వేచివుంటాను. అప్పుడు అతను ఖచ్చితంగా వస్తాడు. అతన్ని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. చూస్తూ ఉండు” అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది యువరాణి మణిమేఖల.

ఆ రోజు రాత్రి పౌర్ణమి. మణిమేఖల ఒక్కత్తే రాచతోటలో విహరిస్తుంది. ఇంతలో పగటి చుక్క అక్కడికి వచ్చాడు. మణిమేఖలకి అర్ధం అయ్యింది ఈ వచ్చిన అతనే పగటి చుక్క అని. కానీ ఆమె మనసులో మెదులుతున్న ఆలోచనలు వేరేవి.

`అబ్బా! ఎంత అందంగా ఉన్నాడీ అబ్బాయి! ఇతనే గనక దొంగ కాక పోయుంటే, నేను ఖచ్చితంగా ఇతన్ని పెళ్ళి చేసుకొని ఉండేదాన్ని’ అనుకుంది మణిమేఖల.

అటు పగటి చుక్క కూడా `ఎంత సౌందర్యవతీ ఈ అమ్మాయి! ఈమే గనక నన్ను పెళ్ళి చేసుకుంటానంటే నా చోర వృత్తిని మానేస్తాను’ అనుకున్నాడు.

"ఓ రూపవతీ! నేను ఒక యాత్రికుణ్ణి. ఈ రాచతోటలో నేను విశ్రాంతి తీసుకోవచ్చా” అని అడిగాడు పగటి చుక్క.

మణిమేఖల అందుకు సమ్మతించింది. ‘ఈ యాత్రికుడిగా చెప్పుకుంటున్న అతను, పగటి చుక్కేనని నిరూపించాలి కదా. అందుకని ఏమీ తెలియనట్టు వేచివుంటే, పగటి చుక్క నా దగ్గర ఏదో ఒకటి దొంగిలించబోతాడు. అప్పుడు పట్టుకుని భటులకు అప్పగిద్దాం’ అనుకుంది మణిమేఖల.

మణిమేఖల “నాకు చాలా నిద్ర వస్తుంది, మీకు కూడా అలసటగా ఉన్నట్టుంది. ఆ ఆసనం మీద పడుకుందురుగాని పదండి” అంటూ అతన్ని తోటలో విశ్రాంతి తీసుకోడానికి ఉంచిన ఆసనాలని చూపించింది.

ఇద్దరూ దూరం దూరంగా పడుకున్నారు. పగటి చుక్క అటు తిరిగి పడుకుని ఉండగా, పగటి చుక్క పంచ అంచుని, తన చీర కొంగుకు కట్టుకొని ‘ఇంక పగటి చుక్క లేచాడంటే చాలు నాకు మెలుకువ వస్తుంది’ అనుకుని నిశ్చింతగా నిద్ర పోయింది మణిమేఖల.

తెల్లవారుతుండగా చెలికత్తె వచ్చి లేపితే కానీ ఆమెకు మెలుకున రాలేదు. చూసుకుంటే ఏముంది! పగటి చుక్క ఆమె చీరను కూడా, ఆమెకు మెలుకువ రాకుండా ఊడ తీసుకొని పోయాడు. రాజుకు జరిగింది తెలిసింది. మణిమేఖల తన మనసులోని కోరిక తండ్రికి చెప్పింది. రాజు మాత్రం ఏం చేస్తాడు! ఇలా ప్రకటన ఇచ్చాడు.

"పగటి చుక్కా! నీవు నీ వృత్తిని గనక వదులుకోడానికి ఇష్ఠ పడేటట్లయితే. నా కూతురిని నీకిచ్చి పెళ్ళి చేస్తాను.”

పగటి చుక్క అందుకు ఒప్పుకుని తనెవరో, తన ఇతర వివరాలూ తెలియచేసాడు. పగటి చుక్క పెళ్ళి మణిమేఖలతో అయిపోయింది. రాజుకు మణిమేఖల ఏకైక సంతానం కావడంతో పగటి చుక్క రాజు అయ్యాడు.

ఆ తరవాత నుంచి పగటి చుక్క తన తెలివితో, దేశంలో ఏ ఇబ్బందులూ రాకుండా దేశాన్ని పరిపాలించాడు.

(సమాప్తం)

15, డిసెంబర్ 2008, సోమవారం

రేచుక్క పగటి చుక్క - 4

(నిన్నటి కధ తరువాయి భాగం)

ఆ రోజు రాత్రి కొత్వాల్, మరికొంత మంది సైనికులూ, ‘పగటి చుక్క కానీ, ఏదైనా దొంగతనం చేయటానికి వస్తే పట్టుకుందాం’ అని గస్తీ తెరుగుతున్నారు. అర్ధరాత్రి దాటాక పగటి చుక్క మారువేషం వేసుకుని, కొత్వాల్ ఉన్న చోటికి వచ్చాడు.

కొత్వాల్, ఊరిమధ్యలో ఉన్న గుదిబండ దగ్గర నించుని కాపలా కాస్తున్నాడు. పగటి చుక్కని చూడగానే, మొదట కొత్వాల్ చాలా అప్రమత్తం అయ్యాడు. కానీ పగటి చుక్క తన కాళ్ళనూ, చేతులనూ తనే ఆ గుదిబండలోకి దూర్చి తాళం వేయాలి అని ప్రయత్నించడం చూసి, ‘ఇతను పిచ్చివాడో, లేక అజ్ఞానో అయిఉండాలి’ అనుకుని, పగటి చుక్క ప్రయత్నాన్ని మామూలుగా చూస్తూ ఉండిపోయాడు.

పగటి చుక్క గుదిబండలోకి కాళ్ళూ చేతులు దూర్చాలని ప్రయత్నించాడు. కానీ అడ్డదిడ్డంగా ప్రయత్నంచేసాడు కాబట్టి, అతని ప్రయత్నం ఫలించలేదు. పగటి చుక్క ప్రయత్నాన్ని గమనించే కొద్దీ, కొత్వాల్లో క్రమంగా ఉత్సుకత పెరిగింది. చివరికి చిరాకు కూడా కలిగింది. దాంతో

"అలా కాదు! ఇలాగ” అంటూ తనని తాను అందులో బంధించుకుని చూపించాడు.

వెంటనే పగటి చుక్క కొత్వాల్ ని కర్రతో లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. అంతే కొత్వాల్ స్పృహకోల్పోయాడు. పగటి చుక్క కొత్వాల్ ఇంటికెళ్ళి

"కొత్వాల్ ని దొంగ కొట్టి, గుదిబండలో పెట్టి తాళం వేశాడు. కొత్వాల్ స్పృహకోల్పోయాడు. ఆయన్ని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళండి” అని చెప్పాడు.

వెంటనే ఇంటిల్లిపాదీ హడావుడీగా, లబోదిబో మంటూ కొత్వాల్ దగ్గరకు వెళ్ళారు. పగటి చుక్క దర్జాగా, కొత్వాల్ ఇంటిలోని విలువైన సామాగ్రి మొత్తం దోచుకుని, అక్కడ ఇలా సమాచారం రాసాడు.

"మహారాజా! నా పేరు పగటి చుక్క. నేను ఒక దొంగను. మీరు నన్ను ఏ రకంగాను పట్టుకోలేరు.”

ఇదంతా తెలుసుకున్న రాజుకు పిచ్చెక్కేంత పని అయ్యింది.

"మంత్రివర్యా! వాడిని మీరే ఎలాగో, ఓలాగ పట్టుకోవాలి” అని చెప్పాడు రాజు.

ఇదంతా విన్న పగటి చుక్క. ఆ రోజు, మంత్రికన్నా ముందుగా, మంత్రిలాగా వేషం వేసుకొని, మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి గొంతును అనుకరిస్తూ మంత్రి భార్యతో

"చూడూ! పగటి చుక్క ఈ రోజు మన ఇంటికి దొంగతనానికి వస్తాడని నాకు తెలిసింది. కాబట్టి మన ఇంటిలోని విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకురా. వాటిని మూటకట్టి, పెరడులో ఉన్న బావిలో పడేద్దాం. అలాగే పనివాళ్ళందరిని సిద్దంగా ఉండమను,అతన్ని పట్టుకోటానికి. పగటి చుక్క నాలాగా వేషం వేసుకొని వస్తాడట” అని చెప్పాడు పగటి చుక్క.

ఆవిడ పని వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్పింది. విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి పెరడులో పెట్టారు వాళ్ళంతా. వాళ్ళని “దొంగ వచ్చినట్టున్నాడు చూడండి” అంటూ ఒకటే హడావుడీలో పెట్టి, వాళ్ళు గమనించకుండా బావిలో ఒక పెద్ద రాయి పడేసి. విలువైన వస్తువులను పక్కనే ఉన్న గుబురు పొదలో పడేసాడు పగటి చుక్క.

ఇంతలో అసలు మంత్రి వచ్చాడు. “అదిగో దొంగా! వాణ్ణి పట్టుకొండి. కట్టేయండీ” అంటూ అరిచాడు పగటి చుక్క.

మొదట తన వేషంలో ఇంకొకరూ తనలాగే మాట్లాడుతూ అక్కడ ఉండడం చూడగానే, మంత్రికి ఏమీ అర్ధం కాలేదు. ఈ లోపే పని వాళ్ళు మంత్రిని కట్టేసి, అతను మాట్లాడటానికి లేకుండా నోట్లో గుడ్డ కుక్కెసారు.

"నాకు ఆకలిగా ఉంది. అన్నానికి సిద్ధంచేయ్యి. ఈ లోపు బావి దగ్గర స్నానం చేసి వస్తాను” అని చెప్పి, పగటి చుక్క పొదలలో దాచిన సంపదను తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.

మర్నాడు జరిగిందంతా తెలుసుకున్న రాజుకు ఎం చేయాలో తోచలేదు. ఇంతలో అతిలోక సుందరి అయిన యువరాణి ఇలా అంది......

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

14, డిసెంబర్ 2008, ఆదివారం

రేచుక్క పగటి చుక్క - 3

(నిన్నటి కధ తరువాయి భాగం)

బుర్రకు పదును పెట్టిన రాజుకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. “సరే! ఒక పని చేయండి. దేశంలోని చెరువులు, నదులు అన్నిటి దగ్గర భటులను కాపలా ఉంచండి. నదులో తండ్రి బూడిద కలిపి, పిండం కాకులకు వేయడానికి పగటి చుక్క రాక తప్పదు. అప్పుడు పట్టుకోండి” అని చెప్పాడు రాజు.

చకచకా పగటి చుక్క తనేం చేయాలో లెక్కలు కట్టాడు. దాని ప్రకారం, ఈ సారి పగటి చుక్క పిచ్చివాడిలాగా, అడ్డదిడ్డంగా బట్టలు వేసుకొని, జుట్టు అంతా చింపిరిగా దువ్వుకొని, శ్మశానం ప్రక్కనున్న నది దగ్గరికి వెళ్ళాడు. ఒక సారి గట్టిగా అరిచి, ఒక సారి ఏడ్చి, ఒక్కసారిగా నవ్వి, అచ్చం పిచ్చివాడిలాగా ప్రవర్తించసాగాడు.

మొదట భటులు చాలా అప్రమత్తం అయ్యారు, కానీ రెండు నిముషాలకే అతను పిచ్చివాడులే అనుకుని అంతగా పట్టించుకోలేదు. పగటి చుక్క తండ్రి బూడిద మొత్తం తీసి ఒంటికి పూసుకుని, తలమీద పొసుకుని, నీళ్ళలోకి దిగి ఏవో పిచ్చిపాటలు పాడుతూ తెగ ఈతలు కొట్టాడు. అలా పిచ్చి వాడిలా నటిస్తూనే కట్టెల పొయ్యి మీద అన్నం వండాడు. వండిన అన్నాన్ని అన్ని వైపులకి విసిరేసి, పక్షుల కూతలు, జంతువుల అరుపులను అనుకరిస్తూ అరిచాడు. దాంతో కాకులు వచ్చి అతను చల్లిన అన్నం ముద్దలను తిన్నాయి. తరవాత పగటి చుక్క అన్నం వండిన కుండను పగలకొట్టి మళ్ళీ నీళ్ళల్లో స్నానం చేసి, పిచ్చివాడిలా ప్రవర్తిస్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ రోజంతా చూసిన తరవాత భటులు, జరిగిన దంతా రాజుకు చెప్పారు. జరిగినది విన్న రాజుకు చిర్రెత్తుకొచ్చింది. “ఛ! ఆపాటి కనిపెట్టలేక పోయారా, వాడు పిచ్చివాడు కాదు, పగటి చుక్క అని? కానీ ఆ పగటి చుక్కని ఎలాగైనా పట్టుకోవాలి. సరే, దేశం అంతా దండోరా వేయించండి “ఎవరైనా శ్రాధ్దం పెట్టడానికి బ్రాహ్మణులని రమ్మని అడిగితే వెంటనే వాళ్ళగురించి మాకు తెలియచేయండి” అని. ఖచ్చితంగా శ్రాధ్దం పెట్టి, భోజనాలు చేసి వెళ్ళటానికి ఎవరైనా బ్రాహ్మణులను అతను ఆహ్వానిస్తాడు” అన్నాడు రాజు.

కానీ వీళ్ళ ఎత్తులన్నీ చిత్తుచేస్తూ, పై ఎత్తు వేసాడు పగటి చుక్క. ఊరి బైట సత్రం దగ్గర మాటువేసి ఉండసాగాడు. ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు పరదేశం నుండి ఆ దేశానికి వచ్చారు. వెంటనే పగటి చుక్క వాళ్ళని తన తండ్రికి శ్రాధ్దం పెట్టటానికి రమ్మని పిలిచాడు.

వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి. తన ఇంటికి తీసుకెళ్ళి తండ్రికి శ్రాధ్దం పెట్టించాడు పగటి చుక్క. బ్రాహ్మణుల భోజనాలు అయిపోయాక వాళ్ళకి చాలా ధనం ఇచ్చి, వాళ్ళ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టి సత్రం దగ్గర దింపి వెళ్ళిపోయాడు పగటి చుక్క.

చాలా ధనం వచ్చేటాప్పటికి వాళ్ళు చాలా ఆనంద పడుతూ ఊరిలోకి వచ్చారు. వాళ్ళ ఆనందం చూసిన భటులకు ఇక్కడేదో తేడాగా ఉంది, అని వాళ్ళ మనసుకు తోచింది. వెంటనే వాళ్ళు బ్రాహ్మణులను “బ్రాహ్మణోత్తమా! మీ సంతొషానికి కారణం ఏంటీ?” అని అడిగారు.

బ్రాహ్మణులు జరిగింది చెప్పారు. వాళ్ళు రాజు దగ్గరకు బ్రాహ్మణులను తీసుకెళ్ళారు. రాజు జరిగింది విని,

"సరే. విప్రోత్తములారా! ఆ దొంగ రూపు రేఖలు చెప్పగలరా?” అని అడిగాడు రాజు.

వెంటనే వాళ్ళు “క్షమించాలి మహారాజా! అతను తన మొహాన్ని ఒక వస్త్రంతో కప్పేసుకున్నాడు. కాబట్టి మేము చూడలేదు” అని చెప్పారు.

రాజు తల పంకించి, "ఈ దొంగ చాలా తెలివైన వాడిలాగా ఉన్నాడు. ఇతడిని ఎలాగైనా పట్టుకుని తీరాలి. ఇది మనకొక సవాల్. కొత్వాల్! నీకీ పని అప్పగిస్తున్నాను. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి, అర్ధమైందా” అని రాజు చెప్పాడు. కొత్వాల్ కూడా అది తనకొక సవాల్ అనుకున్నాడు.

పగటి చుక్క కూడా అదే అనుకున్నాడు. ‘నన్ను పట్టుకుంటారా, చూస్తాను. మీ పరువు నిండునా పోయేట్టు చేస్తా’ అనుకున్నాడు.

ఆ రోజు రాత్రి...........

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

12, డిసెంబర్ 2008, శుక్రవారం

రేచుక్క పగటి చుక్క - 2

(నిన్నటి తరువాయి భాగం)

పగటి చుక్కను పట్టుకోడానికి ఒక మార్గం దొరికింది కదా అన్న ఆనందంతో రాజు ఇలా చెప్పాడు “సరే అయితే! ఒక పని చేయండి. ఈ తలలేని శవాన్ని, మన దేశం మొత్తం ఊరేగించండి. అలా దేశం మొత్తం తిప్పినప్పుడు ఎవరైనా ఈ మొండెంని చూసి ఏడ్చారంటే వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ దొంగ కుటుంబం వారే అవుతారు.”

రాజు రేచుక్క శవాన్ని ఎం చేస్తాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పగటి చుక్క కూడా మామూలు జనంతో పాటు రాజ దర్బారుకు వచ్చాడు. ఈ తీర్పువిని, ఇంటికి వెళ్ళగానే, రాజ దర్బారులో జరిగినది మొత్తం తల్లికి చెప్పి “అమ్మా! నాన్నగారి శవం మన ఇంటిదగ్గరకి వచ్చినప్పుడు నువ్వు ఎట్టి పరిస్తుతుల్లోనూ ఏడవకూడదు” అని చెప్పాడు.

"అది ఎలారా నాయనా? ఆయన నా భర్త. ఆయనతో ఇన్నాళ్ళు కాపురం చేసినదాన్ని. ఆయన శవాన్ని చూసి కూడా ఏడవకుండా ఉండడం నాకు సాధ్యం కాదురా” అన్నది నిశి.

ఆ మాటతో బాగా ఆలోచించి, పగటి చుక్క ఒక పధకం పన్నాడు. ఆ ప్రకారం చేయమని తల్లికి చెప్పాడు. ఆ వెంటనే తల్లి కొడుకులు ఇద్దరూ ఆ వీధిలోంచి వేరే వీధికి వెళ్ళారు. ఎక్కడ ఎవరూ వీళ్ళను గుర్తుపట్టరో ఆ వీధికి. ఊరేగింపు ఆ వీధిలోకి వస్తుండగా, పగటి చుక్క ఆ వీధిలోని ఒక మునగ చెట్టు ఎక్కి క్రిందికి దూకాడు. భర్త శవాన్ని చూడగానే నిశి ఒకటే ఏడ్చింది. భటులు వచ్చి “అమ్మా! మీరు ఏడవటనికి కారణం ఏమిటి?” అని అడిగారు.

"బాబూ! ఇదిగో వీడు నా కొడుకు పగటి చుక్క. ఈ చెట్టుపై నుండి వీడు క్రింద పడ్డాడు. అందుకని నేను ఏడుస్తున్నాను” అని చెప్పింది నిశి.

ఆ ఊరేగింపు ముందుకు సాగిపోయింది. అలా శ్మశానాన్ని చేరుకుంది. అక్కడ పఠిష్టమైన కాపలా పెట్టి, సేనాపతి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు.

"ఎవ్వరూ ఏడవలేదా?" అని అడిగాడు రాజు.

"లేదు ప్రభు! అందరూ మామూలుగానే చూసారు. ఇతని శవం చూసిన కారణంగా ఎవరూ ఏడవలేదు” అని చెప్పాడు సేనాపతి.

"మీరు సరిగ్గా గమనించారా! అది అసాధ్యం!” అన్నాడు రాజు.

"లేదు మహారాజా! ఎవ్వరూ ఏడవలేదు. ఒక 40 ఏళ్ళ యువతి మాత్రం ఆమె కొడుకు మునగ చెట్టు మీద నుండి క్రింద పడ్డాడని ఏడ్చింది తప్ప, ఈ శవాన్ని చూసి ఎవరూ ఏడవలేదు" అన్నాడు సేనాపతి.

అసలు ఏమి జరిగిందో విన్న రాజు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. “బుద్దిలేని అడ్డగాడిదల్లారా! ఆ 40 ఏళ్ళ యువతి, దొంగ భార్య అయ్యుంటుంది. పగటి చుక్క, దొంగ కొడుకు అయ్యింటాడు. ఎందుకంటే ఈ దొంగకి 40 నుంచి 45 ఏళ్ళ వయసు ఉండచ్చు. అలా అన్నప్పుడు వాడికి 40 ఏళ్ళ భార్య, 20 ఏళ్ళ కొడుకు ఉండే అవకాశం ఉంది కదా. ఆ ఇద్దరూ కలిసి ఇంత నాటకం ఆడితే నమ్మేసి వస్తారా, బుద్ది లేదూ! ముందు ఆ వీధికి వెళ్ళి పగటి చుక్క గురించి కనుక్కోండి”అని చెప్పాడు రాజు. కాని రెండు నిముషాలకే భటులు వైఫల్యంతో తిరిగి వచ్చారు.

రాజు బాగా ఆలోచించి “సరే ఒక పని చేయండి! ఈ రోజు రాత్రికే ఈ శవాన్ని శ్మశానంలో చితి పేర్చి కాల్చండి. తనతో పాటూ తీసుకెళ్ళిన తలనుకూడా చితిలో భస్మం చేయడానికి పగటి చుక్క వస్తాడు. అది మన సాంప్రదాయం. దాన్ని ఎవరూ మీరరు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, అతన్ని మీరు పట్టు కోవచ్చు” అన్నాడు రాజు.

ఇదంతా దర్బారులో విన్న పగటి చుక్క ఒక చక్కని పధకం పన్నాడు. ఆ రాత్రికి పగటి చుక్క మొహం తప్పించి శరీరం మొత్తం కనిపించకుండా ఉండే నల్లని దుస్తులు వేసుకున్నాడు. మొహానికి నల్లని రంగు పూసుకున్నాడు. కాగడాలు వెలిగించి ఒక చేతిలో, ఒక రెండు కాగడాలు. ఒక చేతిలో, మరో రెండు కాగడాలు. వీపు దగ్గర, మరో రెండు కాగడాలు కట్టు కున్నాడు. ఒక నల్లని గుర్రం ఎక్కి, విచిత్రమైన అరుపులు అరుస్తూ శ్మశానంలోకి వచ్చాడు.

పగటి చుక్క అలా రావడం చూడగానే భటులు, అతన్ని కొరివి దయ్యం అనుకొని అక్కడి నుండి పారిపోయారు. పగటి చుక్క మూడుసార్లు తండ్రి చితి చుట్టూ గుర్రం మీద కుర్చునే ప్రదక్షణలు చేసి, రేచుక్క తల చితిలో పడేసి అక్కడి నుండి ఆఘమేఘాల మీద వెళ్లిపోయాడు.

మర్నాడు జరిగినదంతా విన్న రాజుకు ఒళ్ళు మండిపోయింది. “తెలివి తక్కువ దద్దమ్మల్లారా! ఆ వచ్చినది కొరివి దయ్యమూ కాదూ, గాడిద గుడ్డూ కాదూ. వచ్చినది పగటి చుక్క! అలా కాకపోతే వచ్చినవాడు, దొంగ చితి చుట్టూ ఎందుకు 3 సార్లు ప్రదక్షణలు చేస్తాడు? మీరు అనవసరంగా భయపడి అతని పని సులభం చేసారు. కాని వాడు ఎక్కడికి తప్పించుకుంటాడు! ఈ సారి, దొంగ బూడిద తీసుకెళ్ళటానికి తప్పకుండా పగటి చుక్క వస్తాడు. సేనాపతీ! జాగ్రత్తగా కాపలా కాయండి. రాత్రికి గుడారాలు వేసుకునైనా సరే, అక్కడే ఉండు” అన్చెప్పాడు రాజు.

పగటి చుక్క ఇందుకు కూడా ఒక చక్కని పధకం రచించాడు. పధకం ప్రకారం, ఆ రోజు రాత్రి పగటి చుక్క, సేనాపతి భార్యలాగా వేషం వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు. భటులు సేనాపతి భార్యే వచ్చింది అనుకుని, పగటి చుక్కని గుడారం లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళగానే పగటి చుక్క నిద్రపోతున్న సేనాపతి నోట్లో ఒక పెద్ద గుడ్డముక్కని దూర్చేసి, అతనికి ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే, అతని కాళ్ళు చేతులు కట్టేసాడు.

ఆ గుడారంలో ఉన్న తండ్రి బూడిద, అస్థికలు తీసుకుని, భటులకు ధన్యవాదాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుతుండగా సేనాపతిని గుడారం బైట నుంచి ఎంత పిలిచినా పలకక పోయేటప్పటికి భటులు లోపలికి వెళ్ళి, సేనాపతి పరిస్థితి చూసిన భటులు, అతని కట్లు విప్పి రాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు.

రాజుకు అరికాలు మంట నెత్తికెక్కింది. “సన్నాసుల్లారా! చవటల్లార! వచ్చిన వాడు కాళ్ళూ, చేతులూ కట్టేస్తుంటే ఏంచేసావు. కట్టు బాబూ, కట్టు అంటూ కట్టించుకున్నావా” అని ఛడామడా తిట్టాడు రాజు. మళ్ళీ బుర్రకి పదును పెట్టిన రాజుకు ఇంకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది........

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

10, డిసెంబర్ 2008, బుధవారం

రేచుక్క పగటి చుక్క-1

మన జానపద కధలలో నాకు బాగా ఇష్టమైన కధ.

పూర్వం విజయపురి అనబడే ఒక పెద్ద దేశం ఉండేది. ఆ దేశంలో రేచుక్క అనే పేరుగల ఒక ఘరాన గజదొంగ ఉండేవాడు. రేచుక్క పైకి అందరికి తను ఒక మామూలు వ్యాపారిని అంటూ చలామణి అయ్యేవాడు కాని అతను ఎన్నొ ఘరానా దొంగతనాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు.

కొన్నాళ్ళకి అతని భార్య నిశి గర్భవతి అయ్యింది. రేచుక్క “మనకి పిల్లలు పుట్టబోతున్నారు. జీవితాంతం వాళ్ళు సుఖంగా వుండడానికి, రాజుగారి ఖజానా కొల్లగొట్టాలి. కాబట్టి నేను రాజధానికి వెళ్తాను” అంటాడు.

"మనకి ఇప్పటికే ఎంతో డబ్బు ఉంది. ఇంకా ఎందుకు? వద్దులేండి” అన్నది నిశి. కాని భార్యకి నచ్చచెప్పి రేచుక్క రాజధానికి వెళ్తాడు.

ఆ రాజధానిలో ఒక అందమైన రాజనర్తకి నివసించేది. ఆ నర్తకీ అందాన్ని చూసి ముగ్ధుడైన రేచుక్క తను వచ్చిన పని మరచి నర్తకి వెంట పడ్డాడు. ఆ నర్తకి ధనం తీసుకుని రేచుక్కకి సకలోపచారాలూ చేసింది. క్రమంగా రేచుక్క తన గతం పూర్తిగా మరిచాడు.

*** *** ***

నిశి ఒక మగశిశువుకి జన్మ నిచ్చింది. ఆ బిడ్డకి పగటి చుక్క అని పేరు పెట్టింది. పగటి చుక్క పెరిగి పెద్దవాడు అయ్యాడు. 20 ఏళ్ళ యువకుడు అయ్యాడు. అతని చిన్నప్పటి నుంచి తల్లి ఏదో బాధపడడం గమనిస్తూనే ఉన్నాడు. ఒక రోజు తల్లి ఎందుకు అంతగా మదన పడుతుందో అడిగాడు. ముందు చెప్పడానికి నిరాకరించినా, చివరికి నిశి రేచుక్క ఖజానా కొల్లగొట్టడానికి వెళ్ళాడని, కాని తిరిగి రాలేదని చెప్పింది.

అదంతా వినగానే పగటి చుక్క “అమ్మా! నాన్న ఎక్కడున్నా సరే తీసుకొని వస్తాను. నన్ను రాజధానికి వెళ్ళదానికి అనుమతించు అమ్మా” అన్నాడు.

"లేదు నాయనా! వద్దు! మీ నాన్న బ్రతికి ఉన్నారో లేదో తెలీదు. ఇప్పటికే భర్తకి దూరమైన నేను, నిన్ను కూడా వదులుకోలేను. వెళ్ళద్దు!” అంటు ప్రాధేయపడింది నిశి.

కాని చివరికి పగటి చుక్క నానా తంటాలూ పడి తల్లిని ఒప్పించి, రాజధానికి బయల్దేరాడు.

*** *** ***

రాజధానిలో ఒక సత్రంలోకి దిగి ఊర్లో విశేషాలు తెలుసుకుంటూ తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయసాగాడు పగటి చుక్క. తల్లి చెప్పిన గుర్తులను బట్టీ రేచుక్కను గుర్తు పట్టాడు. కానీ రేచుక్క ఎక్కడ నివసిస్తున్నాడు? ఎం చేస్తున్నాడు? లాంటి వివరాల కోసం రేచుక్కని అనుసరించసాగాడు.

ఒకసారి అనుకోకుండా పగటి చుక్కని చూసిన రేచుక్కకి ఏదో ఇబ్బందిగా అనిపించింది కానీ ఎందుకో అర్ధం కాలేదు. ఏదోలే అనుకోని ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు రేచుక్క.

ఒక రోజు రేచుక్క, రాజనర్తకీ అంగళ్ళ వీధిలో నడుచుకూంటూ వెళ్తున్నారు. ఇంతలో ఒక బట్టల దుకాణంలో చాలా ఖరీదైన చీరను చూసింది నర్తకీ. ఆ చీర చాలా అందంగా రత్నాలు పోదగబడి ఎంతో అందంగా ఉంది. నర్తకీ ఆ చీర కావాలంది.

"నీ కెందుకు! నిశ్చింతగా ఇంటికి పద. రేపు పోద్దున్నే ఆ చీర నీ ఇంట్లో ఉంటుంది” అని చెప్పాడు రేచుక్క. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు.

ఆ మాటలు వెన్న పగటి చుక్కకి అర్ధం అయ్యింది, ‘అయితే నా తండ్రి ఆ చీర దొగిలిస్తాడన్నమాట! అతను నిజంగా నా తండ్రేనా కాదా అన్న విషయం తెలుసు కోవడానికి మంచి అవకాసం దొరికింది’ అనుకున్నాడు పగటి చుక్క.

ఆ రాత్రి చీరను దొంగిలించి తన ఇంట్లో దాచుకున్నాడు రేచుక్క. రేచుక్క నిద్రపోయాక చప్పుడు చేయకుండా ఆ ఇంట్లో ప్రవేశించాడు పగటి చుక్క. ఆ చీరను దొంగిలించి తన గదిలో ఒక గుంత తవ్వి, చీరను ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టెని గుంతలో పెట్టి దాన్ని మట్టితో కప్పేసి పడుకున్నాడు.

మర్నాడు రేచుక్క తను దొంగిలించిన చీర అలమారాలో లేకపోవడం గమనించాడు. ‘అంటే ఎవరో దొంగిలించి ఉండాలి’ అనుకున్నాడు రేచుక్క. ఆ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు గుర్తుతెచ్చుకున్నాడు. వెంటనే అతనికి తనని అనుసరించిన 20 ఏళ్ళ యువకుడు గుర్తుకువచ్చాడు. ఆ అబ్బాయిని చూడగానే ఎందుకో తనకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకు అని ఆలోచించాడు రేచుక్క. అప్పుడు అతనికి నిశి గుర్తుకు వచ్చింది ‘ఒక వేళ తనకి పుట్టినది అబ్బాయైతే కచ్చితంగా ఆ అబ్బాయికి 20 ఏళ్ళు ఉంటాయి. ఒక వేళ నన్ను అనుసరించిన అబ్బాయి నా కొడుకేనా?’ ఇలా రకరకాల ఆలోచనలు రేచుక్క బుర్రలో మెదిలినై, దాంతో ఒక నిర్నయానికి వచ్చాడు. ‘ఒక వేళ ఆ అబ్బాయి నా కొడుకే గనక అయితే కచ్చితంగా నాకు ఉన్న తెలివితేటలు ఆ అబ్బాయికి కూడా ఉండుండాలి. కనుక అతనిని పరిక్షిస్తాను’ అనుకున్నాడు రేచుక్క.

పగటి చుక్క గురించి ఊర్లొ కనుక్కున్నాడు. పగటి చుక్క పేరు, ఎక్కడ ఉంటున్నాడు తెలుసుకోగలిగిన రేచుక్క ఆ రాత్రికి పగటి చుక్క గదిలోకి చప్పుడు చేయకుండా ప్రవేశించాడు.

పగటి చుక్క ఇది ముందలే ఊహించాడు. అందువల్ల నిజంగా నిద్రపోక పోయినా నిద్ర పోతున్నట్టు నటిస్తాడు. అతని నటనని గుర్తించినా గుర్తించనట్టుగా రేచుక్క గది అంతా కలియచూసాడు. గదిలో ఒక మూలన మట్టి ఆ మద్యనే తవ్వి మళ్ళి కప్పిన గుర్తుగా, గదిలో మిగిలిన నేల అలికిన భాగానికీ అక్కడికీ తేడా తెలుస్తుంది.(పాత కాలంలో మట్టి నేలలు కాబట్టి నేల అలకడమే కాని బండలు పరచడమంటే చాలా ఖర్చు కాబట్టి రాజులు మాత్రమే అలా బండలు పరిపించుకునేవారు.) ఆ తేడాను గమనించిన రేచుక్క అక్కడ త్రవ్వి చీరను తీసుకెళ్ళిపోతాడు.

తండ్రి వెళ్ళిన కాసేపటికి పగతి చుక్క కూడా బయలుదేరుతాడు. ఇది ముందే ఊహించిన రేచుక్క తను పడుకోబోయే మంచానికి పైన గాలిలో ఒక ఉట్టిని వేలాడతీసి దాని మీద చీరను పెట్టి, దాని మీద ఒక ముంతను పెట్టి, దాని నిండుగా నీళ్ళు పోస్తాడు. గాలికి ఊగినా సరే మంచం మీద నీళ్ళు పడేటంత నిండుగా నీళ్ళు పోసి మంచం మీద పడుకొని నిద్ర నటించసాగాడు.

కొంత సేపటి తరవాత అక్కడికి వచ్చిన పగటి చుక్క ఆ అమరికని చూసిన వెంటనే వెళ్ళి ఒక కచ్చిక (స్పాంజి లాంటిది, నీళ్ళను పీల్చుకుంటుంది.) తెచ్చి ముంతలోని నీళ్ళను పీల్చుకునేట్టు పట్టుకొని, ముంతలో నీరు తగ్గగానే ముంతని తీసి పక్కన పెట్టి చీరను తీసుకొని వెళ్ళబోతాడు. కానీ రేచుక్క అతనిని ఆపి “ఎవరు నువ్వు? ఎందుకు నా దారికి అడ్డువస్తున్నావు?" అని అడుగుతాడు.

దానికి జవాబుగా పగటి చుక్క “నా తల్లి పేరు నిశి. నా పేరు పగటి చుక్క. నా తండ్రి పేరు రేచుక్క. అతను ఎక్కడ ఉన్నాడొ తెలీదు ఆయనని వెతకడానికి ఈ ఊరు వచ్చాను” అని చెప్తాడు పగటి చుక్క.

వెంటనే తను ఎవరో చెప్పి, వెంటనే కొడుకుతో పాటూ నిశి దగ్గరికి వచ్చి, ఆమెని క్షమాపణాలు వేడుకుంటాడు. కొన్నాళ్ళు బాగానే గడిచినై. కాని మళ్ళీ రేచుక్కకి రాజుగారి ఖజానా కొల్లగొట్టాలన్న కోరిక కలిగింది. కొడుకుని బలవంత పెట్టి చివరికి ఇద్దరూ ఖజానా కొల్లగొట్టడానికి బయలుదేరారు.

కానీ ఖజానా కొల్లగొట్టి తిరిగి కోట బైటికి వస్తున్నప్పుడు భటులు పట్టుకుంటారు. ఐతే బైటీకి వచ్చేందుకు వీళ్ళిద్దరూ ఒక కన్నం చేసారు. పగటి చుక్క ఆ కన్నం ద్వారా బయటికి ముందే వచ్చాడు. రేచుక్క వస్తూ ఉండగా భటులు రేచుక్క కాళ్ళను పట్టుకున్నారు.

"కొడకా చిక్కాన్రా!” అంటాడు రేచుక్క. వెంటనే పగటి చుక్క తండ్రి తలను నరికేసి డబ్బుతో సహా అక్కడి నుండి పారిపోతాడు.

తండ్రి తలను ఎందుకు నరికాడంటే ఒకవేళ రేచుక్కను ఊరూరూ తిప్పించారంటే తన ఊరిలో జనాలు రేచుక్కను గుర్తుపట్టే ప్రమాదం ఉంది. అప్పుడు తనకీ తన తల్లికీ కచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. అందుకని ముందే తల నరికేసాడు. ఈ పధకం వేసుకొనే ఇద్దరూ బయలుదేరారు.

మర్నాడు రాజు దగ్గర జరిగినదంతా చెప్పారు భటులు. రేచుక్క శవాన్ని చూసిన రాజుకు రేచుక్క కొడుకైన పగటి చుక్కను పట్టుకోడానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే.........

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

8, డిసెంబర్ 2008, సోమవారం

దరహాసం - చిరు కోపం (బొమ్మ)

6, డిసెంబర్ 2008, శనివారం

నా కిష్టమైన మా బుజ్జి పాట

నేనూ నా జూనియర్స్ ఎంతో ఇష్టంగా పాడుకున్న మా బుజ్జి పాట. మా లాగే ఇంకా ఎంతో మంది పాడుకోవాలని రాస్తున్నాను.

పల్లవి:

పిల్లలం మేం పిడుగులం
తల్లి భారతి బిడ్డలం (2 సార్లు)
స్వార్ధానే జయిస్తాం
అవినీతిని ఎదిరిస్తాం (2 సార్లు) “పిల్లలం”

1వచరణం:

చదువులు చక్కగా చదివేస్తాం
ఆటలు బాగా ఆడేస్తాం (2 సార్లు)
అన్నం చక్కగా తినేస్తాం
అమ్మా , నాన్నను వేధించం (2 సార్లు) “పిల్లలం”

2వచరణం:

నీటిని పొదుపు చేసేస్తాం
చెట్లను బాగా పెంచేస్తాం (2 సార్లు)
అడవులు , నదులు నిండుగ కలిగిన
భారత దేశాన్నే నిర్మిస్తాం (2 సార్లు) “పిల్లలం”

3వచరణం:

అసత్యం మేం పలుకనే పలుకం
అన్యాయం మేం చేయనె చేయం (2 సార్లు)
చల్లగా నవ్వుతాం
తియ్యగా పాడుతాం (2 సార్లు) “పిల్లలం”

5, డిసెంబర్ 2008, శుక్రవారం

ఇది నా చిన్నప్పటి నేను

4, డిసెంబర్ 2008, గురువారం

రాతల అబ్బాయి - చూపుల అమ్మాయి