23, జనవరి 2009, శుక్రవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 4

(నిన్నటి కధ తరువాయి భాగం)

విక్రమార్కుడు `కధలు మాత్రమే ఈ పలుకని పడంతిని మాట్లాడించగలవు’ అనుకున్నాడు. వెంటనే పలుకని పడంతికీ తనకీ మధ్యలో అడ్డంగా ఉన్న తెరగుడ్డని, "ఓ తెరగుడ్డా! పలుకని పడంతి ఒక్కమాటైనా మాట్లాడటం లేదు. నాకా నిద్ర రావడం లేదు. రాత్రా పొద్దుపోవటం లేదు. దీపాలా బాగా వెలుగుతున్నాయి. కనీసం నువ్వన్నా పొద్దుపోవటానికి ఏదైనా కధ చెప్పవా!” అన్నాడు.

విక్రమార్కుడు ఇలా అనగానే, బెతాళుడు తెరగుడ్డలో ప్రవేశించి, "ఓ రాజశ్రేష్ఠా! మీరు నన్ను కధ చెప్పమంటున్నారు. మీకు ఏ కధ చెప్పను. నేను పడ్డపాట్ల కధ చెప్పనా? నేను విన్న కధ చెప్పనా? ఏ కధ చెప్పను?" అని అడిగాడు.

విక్రమార్కుడు “తెరగుడ్డా! ఈ రెండు కధలూ, ఒక దాని తరవాత ఒకటి చెప్పు” అన్నాడు.

అప్పుడు తెరగుడ్డ “సరే, వినండి స్వామి! నేను మొదట విత్తనంగా ఉన్నాను. నన్ను రైతులు పొలంలో నాటగా మొలకగా మొలకెత్తాను. చక్కగా ఆకులతో పెరిగి కాయలు కాసాయి. అందరూ నన్ను పత్తి అన్నారు. నాకు కాసిన కాయలు పండి ఎండి పగిలాక, వాటినుంచి దూది తీసారు. ఆ దూదిని రైతు ఆడవారికి అమ్మాడు. వాళ్ళు నన్నెత్తుకుపోయి కొట్టి నూలుపేడారు. ఆ నూలును ఒక సాలెవాడు తీసుకొనిపోయి, సాగతీసి గంజివేసి తడిలో పెట్టి గుడ్డచేసాడు. ఆ గుడ్డని ఒక వ్యాపారి అంగడిలో ఉంచాడు. ఆ గుడ్డని వీళ్ళు తీసుకువచ్చి కుట్టేవాడికిచ్చారు. వాడు నన్ను చింపి ఈ రూపంలో కుట్టాడు. వీళ్ళేమో నాకు గాలి ఆడకుండా ఇలా కట్టేశారు. ఇన్ని బాధలు పడుతూ నేను కధ ఎలా చెప్తాను” అని ఊరుకుంది.

తెరగుడ్డలోపల బెతాళుడు ప్రవేశించి మాట్లాడుతున్నాడు అని తెలియదు కనుక పలుకని పడంతి ఎంతో ఆశ్చర్యపోయింది. ఆమెకు కొంచెం కుతూహలంగా కూడా అనిపించింది. ‘అసలు ఈ తెరగుడ్డ ఎం కధ చెపుతుందో విందాం’ అనుకుని, పనివాళ్ళకి తెరగుడ్డను తీసేయమని సైగ చేసింది. వాళ్ళు తెరగుడ్డ తీసేసి విక్రమార్కుడికీ పలుకని పడంతికీ మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయారు.

విక్రమార్కుడు “ఊ! ఇప్పుడు చెప్పు!” అన్నాడు. తెరగుడ్డ కధ ఇలా మొదలు పెట్టింది.

తెరగుడ్డ చెప్పిన కధ……..

మదనమోహన తంత్రలోహన సంగీత సాహిత్య సరసోల్లాస హాసిని కధ

"రాజేంద్రా! సావధానంగా విను. మందార పురం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశాన్ని మన్మధ జీవకరుండనే రాజు ఏలేవాడు. అతనికి మంగళకరుడు అనే ప్రతిభాశాలి అయిన మంత్రి ఉండేవాడు. రాజుకూ, మంత్రికీ చెరొక్క కొడుకూ పుట్టారు. రాజు కొడుకుకు మదనమోహనుడనీ, మంత్రి కొడుకుకు తంత్రలోహనుడనీ పేర్లు పెట్టారు. మదనమోహనుడూ, తంత్రలోహనుడూ ఎప్పుడూ ఒకరినొకరు వదలకుండా కన్ను, రెప్పలలాగా కలిసే ఉండేవారు.

ఒకసారి వాళ్ళు అడవిలోకి వేటకి వెళ్ళారు. జంతువులను వేటాడుతూ అడవిలోపలికి ఎక్కడికో వెళ్ళారు. దాహంతో వెతకగా వెతకగా వాళ్ళకొక నీటి మడుగు కనిపించింది. ఆ మడుగు పక్కన ఒక పెద్ద మర్రిచెట్టు, ఒక గుడి ఉన్నాయి. ఇద్దరూ మడుగులో నీళ్ళు తాగి చెట్టునీడన విశ్రాంతి తీసుకుంటుండగా మదనమోహనుడికి నిద్రవచ్చి నిద్రపోయాడు. తంత్రలోహనుడు ‘సరే గుడి చూసొద్దాం అనుకుని’ గుడిలోకి వెళ్ళాడు. గుడిలోని శిల్పాలను చూస్తూ ఉండగా గుడిలో ఉత్తరం దిక్కున ఒక అందమైన అమ్మాయిది నిలువెత్తు విగ్రహం ఉంది. ఆ అమ్మాయి చేతిలో పూలదండ పట్టుకుని ఉంది. తంత్రలోహనుడు ఒక క్షణం నిజం బొమ్మ ఏమో అనుకున్నాడు కానీ కదలకుండా ఉండడంతో బొమ్మ అని అర్ధం చేసుకున్నాడు.

మదనమోహనుడుగానీ ఈ బొమ్మని చూసాడంటే ‘అమ్మో చాలా అపాయకరం అనుకుని’ దేవుడి దర్శనం చేసుకుని మదనమోహనుడి దగ్గరికి వెళ్ళాడు.

"గుడి చూద్దాం రా మిత్రమా” అన్నాడు మదనమోహనుడు.

"నేను ఇప్పుడే వెళ్ళి వచ్చాను. నువ్వు వెళ్ళు కానీ ఉత్తరం వైపుకి మాత్రం వెళ్ళకు” అని చెప్పాడు తంత్రలోహనుడు. సరేనని చెప్పి గుడిలోకి వెళ్ళాడు మదనమోహనుడు. గుడి అంతా చూసాడు చివరగా ఇంక వెళ్దాం అనుకుంటుండగా అతనికి కుతూహలంగా అనిపించింది ‘అసలు ఎందుకు తంత్రలోహనుడు ఉత్తరం వైపు వెళ్ళద్దన్నాడా!’ అని. వెంటనే ఉత్తరం పైపుకి వెళ్ళాడు. అక్కడ ఉన్న అమ్మాయి విగ్రహం చూడగానే అతను ‘అబ్బా! ఎంతటి సౌందర్యం’ అనుకుంటూ, ఆ విగ్రహం నిజంగా అమ్మాయి అనుకుని అక్కడే కూర్చుని “ఆ పూలదండ నా మెళ్ళో వెయ్యి. ఓ సుందరీ! ఆ పూలదండ నా మెళ్ళో వేసి, నన్ను వరించు” అంటూ బ్రతిమాలుతున్నాడు.

ఎంతసేపు అయినా కూడా మదనమోహనుడు రాకపోయేశరికి తంత్రలోహనుడు గుడిలోకి వెళ్ళాడు. [ఇది మదనకామరాజు సినిమాలోని సాదా సీదా కధ కాదు.]

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

3 కామెంట్‌లు:

నేస్తం చెప్పారు...

ఎంత బాగా రాస్తున్నారండి..ఎప్పుడొ చినపుడు మా తాతయ్య చెప్పగా విన్నాను.. ధన్య వాదాలు

మధురవాణి చెప్పారు...

గీతా..
కథ భలేగా సాగుతుంది.
చదువుతూ నేనూ అదే అనుకున్నాను. ఇది 'మదనకామరాజు' సినిమా కథ అని.
నువ్వు భలే తెలివైన చిట్టిదానివి. అందుకే ముందే చెప్పావు అది కాదని :)

నేను వచ్చే భాగం కోసం వెయిటింగ్..

Aha!Oho! చెప్పారు...

నేస్తంగారు:
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
మధుర వాణి అక్క:
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!త్వరలోనే ఇంకొక టపా రాయగలననే ఆశిస్తున్నాను.