19, జనవరి 2009, సోమవారం

పలుకని పడంతి (విక్రమాదిత్యడి కధ) - 1

నా కెంతో ఇష్టమైన విక్రమార్కుడి కధ ఒకటి మీరందరూ చదవాలని రాస్తున్నానండి.

ఎప్పటిలాగా 6 నెలలు దేశాటన, 6 నెలలు రాజ్యపాలన చేసే విక్రమార్కుడికి ఎందుకో ఆ రోజు దేశాటనకి వెళ్ళాల్సిన రోజైనా కూడా వెళ్ళాలనిపించలేదు. దాంతో భట్టిని కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు.

వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా దూరం వెళ్ళారు. అలా నడిచి, నడిచి చివరికి ఒక అడవి మొదలయిన చోట, ఒక మర్రిచెట్టు ఉంది. దానికి రెండు పెద్ద కొమ్మలున్నాయి. ఒక కొమ్మ ఉత్తరం వైపుకీ, ఇంకొక కొమ్మ దక్షిణం వైపుకీ ఉన్నాయి. ఆ కొమ్మలు ఎక్కడ అంతం అవుతాయో కనిపించడం లేదు. అడవి పైన వంతెన లాగా ఉన్న ఆ కొమ్మల వెడల్పు రెండు, మూడు ఎద్దుల బళ్ళు ఒకేసారి వాటి మీద ప్రయాణం చేయగలిగేటంత.

ఆ చెట్టుక్రింద ఒక శిల మీద, "ఉత్తర దిక్కుకు వెళితే అలకాపురి అనే నగరం వస్తుంది. ఆ నగరంలో అమృతమోహిని అనే మహిళ ఉంది. ఆమెకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎవరితోటి మాట్లాడదు. అందువల్ల ఆమెకి ‘పలుకని పడంతి’ అని పేరు వచ్చింది. ఎవరైనా ఆమెని మాట్లాడిస్తే ఆమెనిచ్చి పెళ్ళిచేస్తారు. లేకపోతే గుండుకొట్టించి అవమానించి పంపుతారు. ఇప్పటికి ఎంతమందో అలా అవమానం పొందారు” అని ఉంది.

"తమ్ముడూ! ఈ పలుకని పడంతి సంగతేమిటో చూద్దామా?” అన్నాడు విక్రమాదిత్యుడు.

ఇద్దరూ అలకాపురం వైపు కొమ్మమీద బయలుదేరారు. అసలు ఆ చెట్టు పూర్వాపరాలు ఏమిటి అని విక్రమాదిత్యుడు భట్టిని అడగడంతో, భట్టి ఇలా చెప్పాడు.
"పూర్వం ఈ అడవిలో ఒక ఋషి తపస్సు చేసుకునేవాడు. ఐతే ఈ ఆడవి అవతల ఉన్న ఊళ్ళకి వెళ్ళడానికి వచ్చే జనం వల్ల అతని తపస్సుకీ, జంతువులకీ కూడా భంగం కలుగుతుండంతో ఆ ఋషి ఒక చెట్టు కొమ్మలు ఇలా పెరిగేటట్లు చేసాడని ఇంతకు ముందు విన్నాను. బహుశా ఆ చెట్టు ఇదే అనుకుంటాను.”

ఇద్దరూ చెట్టుకొమ్మమీద నుండీ అడవిని చూస్తూ అలకాపురి చేరారు. అక్కడ డబ్బులిచ్చి ఒక పూటకూళ్ళ అవ్వ ఇంట్లో ఉండసాగారు.

ఒక రోజు వీలుచూసుకుని విక్రమార్కుడూ, భట్టీ “అవ్వా! ఈ ఊరిలో పలుకని పడంతి అని ఎవరో ఒక అమ్మాయి ఉందని విన్నాము. అసలు ఆమె సంగతి ఏమిటి? కొంచెం చెప్పవా!” అని పూటకూళ్ళ అవ్వని అడిగారు.

"పలుకని పడంతి జోలికి మీరు వెళ్ళకండి నాయనా! ఆమె వల్ల ఎంత మంది రాజులూ, మహారాజులూ కూడా అవమానాల పాలయ్యారో. మీరు ఆమెకిచ్చే డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకున్నా మంచి లాభాలు పొందగలరు. ఎందుకు ఆమె జోలికి వెళతారు?" అంటూ అవ్వ ఏదో చెప్ప బోయింది.

"అలా కాదులే అవ్వా! చెప్పవా!” అంటూ అవ్వకి నచ్చజెప్పి విషయం చెప్పమన్నారు.

"సరే ఇంతగా ఆడుగుతున్నారు కనుక చెపుతున్నాను. ఆమె ఇంటి చుట్టూ 10 ప్రాకారాలు ఉంటాయి. మొదటి ప్రాకారంలోకి వెళ్ళాలంటే 1000 హొన్నులు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు చెల్లించిన తరవాత మొదటి ప్రాకారంలోకి వెళ్ళనిస్తారు అక్కడ కాపలా వాళ్ళు విందు పెడతారు. ఆ విందులో ఉడికిన అన్నం, ఉడకని అన్నం. ఒలిచిన పండు, ఒలవని పండు ఇలాగే అన్నీ కూడా ఉంటాయి. ఎవరైతే పలుకని పడంతిని ఓడించడానికి వచ్చారో వాళ్ళు ఆ విందుని తినవలసి ఉంటుంది. ఐతే విస్తరిలో ఏమీ మిగల్చకూడదు. రెండో ప్రాకారంలో మూడు మరబొమ్మలు(రోబో) ఉంటాయి. వాటిలో ఒకటి ముక్కాలి పీట వేస్తుంది. రెండోది వచ్చిన వ్యక్తిని పట్టుకుని మళ్ళీ లేవకుండా పీటమీద కుదేస్తుంది. మూడో బొమ్మ తల గొరుగుతుంది. ఇంకేముంటుంది గుండు తప్ప. కాబట్టే ఈ ప్రాకారాన్ని దాటి ఇంతవరకూ ఎవరూ లోపలికి వెళ్ళలేకపోయారు. కానీ వినికిడి ఏమిటంటే మూడో ప్రాకారంలో ఇద్దరు మల్లయుధ్ద యోధులు ఉంటారు. వాళ్ళని తప్పించుకుని ముందుకు వెళితే నాలుగవ ప్రాకారంలో నల్లకోతి ఉంటుంది. దాన్ని తప్పించుకునిపోతే, అయిదవ ప్రాకారంలో పులి ఉంటుంది. దాన్ని కూదా తప్పించుకుని పొతే, ఆరవ ప్రాకారంలో ఏనుగు ఉంటుంది. దాన్ని తప్పించుకు పోతే, ఏడవ ప్రాకారంలో దారికి అడ్డాంగా ఒక పాడు బడ్డ బావి ఉంటుంది. బావిని గనకా దాటి ఎనిమిదవ ప్రాకారంలోకి వెళితే అక్కడ బురద మడుగు ఉంటుంది. ఆ బురదలో నడిచి మడుగు దాటాక అవతల వైపున ఉండే నత్తగుల్లలోని నీటితో కాళ్ళు శుబ్రంగా కడుక్కోవాలి. అంతేగాక నత్తగుల్లలో సగం నీళ్ళు మిగల్చాలి. తరవాత తొమ్మిదవ ప్రాకారంలో స్పటిక మండపం ఉంటుంది. ఆ నునుపుగా ఉండే స్పటిక మండపంలో క్రింద పడుకుండా నడవాలి. క్రింద పడితే పుర్రె పగిలి చనిపోవడం తప్పించి ఇక ఏమీ మిగలదు. తరవాత ప్రాకారంలో చీకటిగా ఉండే 1000 కాళ్ళ మండపం ఉంటుంది. ఆ మండపంలో దారి ఎటో తెలిసి వెళ్ళాలి పొరపాటు దారిలో వెళితే స్తంబాల మద్య చనిపోవలసిందే. అక్కడ దీపం వెలిగించినా వెలగదట. కాబట్టి ఆ చిమ్మచీకటిలో భయపడకుండా సరైన దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా దాటితే పలుకని పడంతి భవనం వస్తుంది. ఆ భవనంలో మొదటి గదిలో ఒక మంచం ఉంటుంది. ఆ మంచానికి రెండు వైపులా ఒకేలాగా ఉంటుంది. కాళ్ళకట్ట ఏదో, తల కట్ట ఏదో తెలిసి పడుకోవాలి. తప్పు పడుకుంటే, 10 మరబొమ్మలు వచ్చి, ఒకటి మొహం మీద వేడి నీళ్ళు పోస్తుంది. ఒకటి చితక బాదుతుంది. ఇలా ఒకొక్కటీ ఒకొక్క పని చేస్తాయి. సరిగ్గా పడుకుంటే, అవే 10 మరబొమ్మలలో ఒకటి నాట్యం చేస్తుంది. ఒకటి తాంబూలం ఇస్తుంది. ఒకటి ఉపచారాలు చేస్తుంటుంది. ఇలా ఏమార్చే ప్రయత్నం చేస్తుంటాయి తెల్లవారక మునుపే వాటినుండీ తప్పించుకుని వెళితే అప్పుడు పలుకని పడంతిని కలవచ్చు కానీ తెల్లవారేలోపల ఆమెని 3 సార్లు మాట్లాడించాలి అప్పుడు ఆమె వరిస్తుంది. లేకపోతే ఇంత కష్ట పడీ వృధా” అని చెప్పింది అవ్వ.

విక్రమార్కుడు అంతా విని, అవ్వకి ధన్యవాదాలు చెప్పి, తరవాత భట్టితో “పలుకని పడంతి నెత్తిమీద కట్టెలమోపు పెట్టించి, ఊరి పొలిమేర్ల వరకూ వడిపిస్తాను” అని పందెంకాసాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

3 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

అసక్తికరం

Uyyaala చెప్పారు...

ఊహా లోకం ఎంత మనోహరంగా వుంటుందో కదా. రెండు ఊళ్ళను కలిపే అంత పెద్ద చెట్టు కొమ్మ, ప్రాకారాలు, మర మనుషులు. అసహజం అవాస్తవం అని తెలిసినా మనసు ఎంత ఉల్లాస పడుతుందో.. కథ పూర్తిగా చెప్పకుండా ఊరించడం మాత్రం ఏమీ బాగాలేదు.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

చాలా పెద్ద కథ అన్నమాట...
waiting for next post...