13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

జల భూతం కధ

చాలా రోజుల నుండీ పెద్ద పెద్ద కధలు రాస్తున్నాను కదా! రాసీ రాసీ నాకైతే ఓపిక అయిపోయింది. అందుకని కొన్ని రోజులు కొన్ని చిన్న కధలు రాయాలనే ఉద్దేశంతో నాకు ఇష్టమైన ఈ చిన్న కధను రాస్తున్నాను. ఈ కధ ఏ పుస్తకంలోనిదో చెప్పలేను కానీ మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కధ అని మాత్రం చెప్పగలను.

రామాపురం అనే ఊరిలో ఉండే రాజయ్యకి ఇద్దరు కొడుకులు. రాజయ్య చనిపోగానే రాజయ్య పెద్ద కొడుకు పొలం, ఇల్లూ, గొడ్డు గోదా అంతా ఆస్తీ తీసేసుకున్నాడు. రాజయ్య రెండో కొడుకు అయిన `చిన్నతమ్ముడు’,
"అన్నా! మరి నా వాటా ఆస్తి ఏది?" అని అడుగగా,
"ఇదుగో, ఈ నారతాడు నీ వంతు ఆస్తి. ఇంక పో” అని అటక మీద ఉన్న నారతాడుని చిన్నతమ్ముడికి ఇచ్చాడు అన్న.

చిన్నతమ్ముడు చాలా మంచి వాడు అవటం వల్ల ‘సర్లే పోనీ. అన్నకి ఆస్తి అంతా తీసుకోవాలని ఉన్నట్టుంది’ అని తనకి తను సర్ధి చెప్పుకుని ఊరుకున్నాడే కానీ పంచాయితీ దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు.

చిన్నతమ్ముడికి చేతి పనులు చాలా బాగా చేయడం వచ్చు. వాడు ఊరు చివర ఉన్న అడవిలోకి వెళ్ళి తన దగ్గర ఉన్న నారతాడుతో వలలూ, ఉచ్చులూ అల్లుకుని వాటితోటి ఒక కుందేలుని, ఒక ఉడతని పట్టుకున్నాడు.

మళ్ళీ అదే తాడుతో ఒక సంచీ లాంటి దానిని అల్లి వాటిని ఆ సంచీలో వేసుకుని బయలుదేరాడు.

అలా నడుచుకుంటూ వెళ్ళీ వెళ్ళీ, చివరికి చిన్నతమ్ముడు ఒక చిన్న జలాశయం పక్కన కూర్చున్నాడు. వాడు అక్కడ కూర్చుని ఉండగా ఒక ఎలుగుబంటి పక్కనే ఉన్న చెట్టుపొదలోకి వెళ్ళడం చూసాడు. మళ్ళీ వాడు మెదలకుండా కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తూ చిన్నతమ్ముడు ఆ జలాశయంలోని నీళ్ళ వైపే చూడసాగాడు.

అయితే ఆ నీటిలో రెండు జలభూతాలు ఉన్నాయి. ఒక తండ్రి జలభూతం, ఒక కొడుకు జలభూతం. అయితే వాళ్ళకి అస్సలు బుర్రమాత్రం లేదు.

కొడుకు జలభూతం చిన్నతమ్ముడిని చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి
" నాన్నా, నాన్నా! ఎవరో ఒకబ్బాయి మన జలాశయం దగ్గరికి వచ్చాడు. అతను మన నీటివైపే చూస్తున్నాడు. అతని దగ్గర తాడుతో అల్లిన వలలూ, సంచులూ ఉన్నాయి. బహుశా అతను ఆ వలలతో మన నీటినంతా పట్టుకుని సంచులలో వేసి తీసుకుని వెళదాం అనుకుంటున్నట్టున్నాడు” అని చెప్పాడు.

"అవునా? అయితే చాలా ప్రమాదమే. నువ్వొక పని చేయి. అతనితో ఏదో ఒక పందెం పెట్టుకుని అతన్ని ఓడించి ఇక్కడి నుండీ పంపించేయి” అని చెప్పాడు తండ్రి జలభూతం.

ఈ కొడుకు వెళ్ళి “ఏయ్ అబ్బాయ్! ఇక్కడి నుండీ వెళ్ళిపో” అన్నాడు.

చిన్నతమ్ముడు భయపడకుండా “నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను” అన్నాడు.

"అయితే, ఒక పని చేద్దాం. మనిద్దరం ఏదైనా పందెం పెట్టుకుందాం. నేను గెలిస్తే నువ్వు ఇక్కడి నుండీ వెళ్ళిపోవాలి” అన్నాడు కొడుకు జలభూతం.

"సరే!” అన్నాడు చిన్నతమ్ముడు.

"సరే! ఇదుగో ఇక్కడున్న ఈ చెట్టుని నువ్వు నాకంటే వేగంగా ఎక్కగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.

"ఓస్! ఆపనికి నేనెందుకు? నా బుజ్జితమ్ముడు చేయగలడు” అని అంటూ ఉడుతని తీసి చెట్టుమీదికి వదిలాడు చిన్న తమ్ముడు. ఉడుత ‘బ్రతుకు జీవుడా’ అనుకుని చెట్టుమీదికి పరుగు తీసింది. ఉడుతతో సమాన వేగంతో చెట్టు ఎక్కలేక కొడుకు జలభూతం ఓడిపోయాడు.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదుగో ఇంకో పందెం. ఈ సారి పందెం ఏంటంటే నువ్వు నాకంటే వేగంగా అడవిలోకి పరిగెత్తగలవా?" అని అన్నాడు.

"ఓసోస్! ఇంతేనా దీనికి నేను ఎందుకు? నా రెండో తమ్ముడు చాలు” అని చెప్పి కుందేలుని వదిలాడు చిన్నతమ్ముడు. అది ఒక్క పరుగున అడవిలోకి పరిగెత్తింది. దానితో సమానంగా పరిగెత్తలేక కొడుకు జలభూతం మళ్ళీ ఓడిపోయాడు.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “ఈ సారి ఇంకో పందెం పెట్టి గెలువు. పో” అని వాడిని మళ్ళీ పంపించాడు. కొడుకు జలభూతం మళ్ళీ వచ్చి
"ఇదిగో ఇంకొక పందెం. నా అంత గట్టిగా నువ్వు ఎవరినైనా సరే పట్టుకోగలవా?" అన్నాడు కొడుకు జలభూతం.

"ఓసోస్ ఓస్! దానికి నేను ఎందుకు? నా పెద్ద తమ్ముడు అదుగో ఇందాకే ఆ చెట్టు పొదలలోకి వెళ్ళాడు. నువ్వు తన దగ్గరికి వెళ్ళు, వదలకుండా పట్టుకుంటాడు” అని చెప్పి ఎలుగు బంటి వెళ్ళిన వైపుకి చూపించాడు చిన్నతమ్ముడు.

కొడుకు జలభూతం వెళ్ళి ఆ పొదలలో ఉన్న ఎలుగు బంటి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వచ్చిన కొడుకు జలభూతంన్ని ఆ ఎలుగు బంటి గట్టిగా పట్టుకుంది. వాడు దాని దగ్గరనుండీ విడిపించుకునే టప్పటికి తల ప్రాణం తోకకి ఒచ్చింది.

వాడు తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. తండ్రి జలభూతం “వీడు సామాన్యుడి లాగా లేడు. వీడితో గొడవ పెట్టుకోవడం కంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చైనా పంపించేయడం మంచిది. కావాలంటే కొంచెం డబ్బు ఇస్తాను. ఈ జలాశయం విడిచి పెట్టి వెళ్ళమని అతనిని అడుగు పో” అని అన్నాడు.

కొడుకు జలభూతం వచ్చి అదే చెప్పాడు.
"సరే! అయితే ఇదుగో నా టోపీ నిండుగా డబ్బు ఇస్తే చాలు” అని చెప్పాడు చిన్నతమ్ముడు.

సరే అని చెప్పి డబ్బు తీసుకురాడానికి కొడుకు జలభూతం వెళ్ళి వచ్చే లోపల చిన్నతమ్ముడు తన టోపీకి ఒక కన్నం పెట్టి, టోపీ పట్టేటంత గుంత తవ్వాడు. అందులో తాడుతో అల్లిన ఒక సంచీ పెట్టి, పైన టోపీ పెట్టాడు. కానీ చూడడానికి మామూలుగా టోపీని నేల మీద పెట్టినట్టుగా ఉంది అంతే.

కొడుకు జలభూతం వచ్చి కొంత డబ్బుని ఆ టోపీలో వేసాడు. అయితే డబ్బంతా క్రింద ఉన్న సంచీలోకి పోయింది. కొడుకు జలభూతం ఇంకొంత డబ్బుతీసుకు వచ్చేలోపల చిన్న తమ్ముడు గుంతలో పెట్టిన సంచీలోని డబ్బుని ఇంకొక సంచీలో నింపి దాన్ని మళ్ళీ ఇందాకటి లాగానే పెట్టాడు. కొడుకు జలభూతం మళ్ళీ డబ్బు తెచ్చి పోశాడు. మళ్ళీ నిండ లేదు. అలా చిన్న తమ్ముడు తను మోయ గలిగినన్ని సంచులు నిండాక ఇక టోపీ క్రింద గుంతలో నిండిన సంచీని పెట్టాడు. దాంతో ఆప్పుడు టోపీ నిండిపోయింది. కొడుకు జలభూతం ‘హమ్మయ్యా!’ అనుకున్నాడు.

చిన్నతమ్ముడు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంచి ఇల్లూ, పొలం పుట్రా, గొడ్డూ గొదా అన్నీ ఆ డబ్బుతో కొనుక్కుని, ఒక మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపాడు.

11, ఫిబ్రవరి 2009, బుధవారం

కృష్ణుడే పోరు తప్పదననీ

9, ఫిబ్రవరి 2009, సోమవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 12

(నిన్నటి కధ తరువాయి భాగం)

పయ్యెద “ఓ రాజేంద్రా! ఇప్పుడు చెప్పండి నలుగురు దొంగలలో ఎవరి సామర్ధ్యం ఎక్కువ?” అని అడిగాడు.

"ఓ పయ్యెదా! రాజూ, మంత్రీ, కొత్వాల్, బట్టల వ్యాపారీ వీళ్ళకే ఎక్కువ సామర్ధ్యం ఉంది” అని చెప్పాడు విక్రమార్కుడు.

అప్పుడు పలుకని పడంతి “ఏమయ్యా నువ్వసలు కధ విన్నావా? లేక నిద్ర పోయావా? అసలు కధ అర్ధమైందా? నలుగురు దొంగలే ఎక్కువ సామర్ధ్యం ఉన్నవాళ్ళు” అని చెప్పింది.

విక్రమార్కుడు “ఔనౌను. నువ్వు చెప్పింది పచ్చి నిజం. అయినా ఇప్పుడు అందంతా ఎందుకు కానీ ఒక్కసారన్న నాతో మాట్లాడవచ్చు కదా?" అని బ్రతిమాలాడు.

అప్పుడు పయ్యెద “ఓ రాజవర్యా! మీరెందుకు ఇంకా ఆమెని బ్రతిమాలుతున్నారు? మీరు కావాలని కధలకి జవాబులు తప్పుగా చెప్పగానే, ఈ పలుకని పడంతి ముందూ వెనుకా ఆలోచించకుండా మాట్లాడేసింది. ఇప్పటికి ఆమె మూడు సార్లు మాట్లాడేసింది. కాబట్టి మీరు గెలిచినట్టే” అని అన్నాడు పయ్యెదలోని భేతాళుడు.

ఆప్పుడు అర్ధమైంది అక్కడున్న వాళ్ళందరికీ తము చేసిన పొరపాటు.

"పలుకని పడంతీ! నీకు నన్ను వివాహం చేసుకోవడం ఇష్టమేనా? నీకు ఇష్టం లేకపోతే నాకే అభ్యంతరం లేదు!” అని అన్నాడు విక్రమార్కుడు. `అంత తెలివైన వాడినీ, తనను ఓడించి ధర్మంగా గెలుచుకుని కూడా తనకి కూడా ఒక మనసు ఉంటుందనీ అర్ధం చేసుకునే అలాంటి మనిషిని ఎలా వదులుకోవడం? అసలు అలాంటి వాడికంటే తనకు కావలిసినది ఇంకెవరు?’ అని యోచించి పలుకని పడంతి విక్రమార్కుడితో వివాహానికి ఒప్పుకుంది. ఇద్దరికీ కూడా వేదవిధులతో వైభవోపేతంగా వివాహం జరిగింది.

ఆ తరవాత భట్టీ, విక్రమార్కుడూ, పలుకని పడంతీ, కొంత మంది పనివాళ్ళతో బయలుదేరారు.

అయితే ఊరు దాటాక విక్రమార్కుడు పలుకని పడంతినీ, భట్టినీ “ఈ పనివాళ్ళతో సహా మీరు ఊరి అడవిలోని ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. నాకు కొంచెం పనుంది. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి నెను వస్తాను” అని చెప్పి విక్రమార్కుడు ఎక్కడికో వెళ్ళాడు.

విక్రమార్కుడు చెప్పినట్టుగానే వీళ్ళు బయలుదేరారు. అయితే విక్రమార్కుడు భేతాళుడి సాయంతో ఒక ముస్సలి వాడి వేషం వేసుకుని ఒక కట్టెలమోపుని మోసుకుంటూ పలుకని పడంతి ఎక్కిన పల్లకీ పక్కనుంచీ నడుచుంకుటూ వెళ్ళాడు.

అంత ముస్సలివాడు అలా మండుటెండలో కట్టెలు నెత్తిన పెట్టుకుని వెళ్ళడం చూసి తట్టుకోలేక పలుకని పడంతి “ఓ స్వామీ! ఎందుకంత కష్టపడీ ఆ కట్టెల మోపుని మీరు తీసుకెళ్ళడం. మా భటులకి ఇవ్వండి వాళ్ళు తెచ్చిపెడతారు” అని చెప్పింది.

"లేదు లేదు! ఇది అసలు కట్టేల మోపు కాదు. ఇవి సమిధులు [యఙ్ఞం కోసం వినియోగించే కట్టెలు] వీటిని బ్రాహ్మణులు లేదా క్షత్రియులు మాత్రమే మోసుకెళ్ళాలి. అన్యులు తాకకూడదు” అని చెప్పాడు వృధ్ధుడి రూపంలోని విక్రమార్కుడు.

పలుకని పడంతి క్షత్రియ కన్య కనుక “సరే ఐతే నాకివ్వండి.నేను క్షత్రియురాలిని” అని చెప్పింది పలుకని పడంతి. విక్రమార్కుడు ఆమె చేతికి ఆ సమిధులు ఇచ్చాడు.

ఆమె ఆ సమిధులని నెత్తిమీద పెట్టుకుని మర్రి చెట్టు కొమ్మదాకా నడిచివాచ్చింది.

విక్రమార్కుడు తను వేసిన పందెంలో గెలిచాడు.

(సమాప్తం)

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 11

(నిన్నటి కధ తరువాయి భాగం)

[ఈ సారి కధలోని ముప్పావు దొంగ దొంగిలించే విధానం అంతా ఇంతక మునుపు నేను రాసిన కధ ‘రేచుక్క, పగటి చుక్క’ కధను పోలి ఉంటుంది. అందుకనే ఈసారి ముప్పావు దొంగదే కాక నిండు దొంగ దొగతనాన్ని కూడా రాస్తున్నాను. నిజానికి ఈ కధనే నిజం కధ. ‘రేచుక్క, పగటి చుక్క’ కధ దీట్లోంచీ, ఇంకా ఇలాంటి కొన్ని కధలలోని కొన్ని సన్నివేశాలు తీసుకుని తయారు చేసిన కధ అని గుర్తించగలరు.]

రాజు ఈ సారి దొంగని పట్టుకునే పనిని మంత్రికి అప్పగించాడు.

ఈ సారి కార్తికేయుడు ముప్పావు దొంగని ఒక ఘనమైన దొంగతనం చేయమని ఆదేశించాడు.

కుంతల నగరానికి వచ్చిన ముప్పావు దొంగ జరిగిందంతా విని, ఆ రోజు, మంత్రికన్నా ముందుగా, మంత్రిలాగా వేషం వేసుకొని, మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి గొంతును అనుకరిస్తూ మంత్రి భార్యతో

"చూడూ! దొంగ ఈ రోజు మన ఇంటికి దొంగతనానికి వస్తాడని నాకు తెలిసింది. కాబట్టి మన ఇంటిలోని విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకురా. వాటిని మూటకట్టి, పెరడులో ఉన్న బావిలో పడేద్దాం. అలాగే పనివాళ్ళందరిని సిద్దంగా ఉండమను,అతన్ని పట్టుకోటానికి. దొంగ నాలాగా వేషం వేసుకొని వస్తాడట” అని చెప్పాడు ముప్పావు దొంగ.

ఆవిడ పని వాళ్ళకి ఇదే విషయాన్ని చెప్పింది. విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి పెరడులో పెట్టారు వాళ్ళంతా. వాళ్ళని “దొంగ వచ్చినట్టున్నాడు చూడండి” అంటూ ఒకటే హడావుడీలో పెట్టి, వాళ్ళు గమనించకుండా బావిలో ఒక పెద్ద రాయి పడేసి. విలువైన వస్తువులను పక్కనే ఉన్న గుబురు పొదలో పడేసాడు ముప్పావు దొంగ.

ఇంతలో అసలు మంత్రి వచ్చాడు. “అదిగో దొంగా! వాణ్ణి పట్టుకొండి. కట్టేయండీ” అంటూ అరిచాడు ముప్పావు దొంగ.

మొదట తన వేషంలో ఇంకొకరూ తనలాగే మాట్లాడుతూ అక్కడ ఉండడం చూడగానే, మంత్రికి ఏమీ అర్ధం కాలేదు. ఈ లోపే పని వాళ్ళు మంత్రిని కట్టేసి, అతను మాట్లాడటానికి లేకుండా నోట్లో గుడ్డ కుక్కెసారు.

"నాకు ఆకలిగా ఉంది. అన్నానికి సిద్ధంచేయ్యి. ఈ లోపు బావి దగ్గర స్నానం చేసి వస్తాను” అని చెప్పి, ముప్పావు దొంగ పొదలలో దాచిన సంపదను తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.


మంత్రి అయ్యుండీ అతను మరీ అంత ఘోరంగా అపహాస్యం పాలయ్యేటప్పటికి రాజుకు ఇంక ఏం చేయాలో పాలుపోలేదు. సరే అనుకుని ‘తనే దొంగని పట్టుకుంటానని’ రాజు ప్రకటించాడు.

అక్కడ మాతంగ పురంలో కార్తికేయుడు ముప్పావు దొంగ చేసిన దొంగతనానికి ఎంతో సంతోషపడ్డాడు. ఈసారి అందరికన్నా పెద్ద వాడైన నిండు దొంగని “దొంగతనం చేసి ఏదైనా తీసుకురా పో!” అని చెప్పి పంపించాడు.

నిండు దొంగ కుంతల నగరంకి వచ్చి వాకబు చేయగా రాజుగారే దొంగని పట్టుకుంటానన్నాడని తెలుసుకున్నాడు.

"ఓహ్హో! అలాగా!” అనుకుని తను చేయాల్సిన దొంగతనం ఎంటో? ఎలా చేయాలో? వేంటనే అంచనాలు వేసుకున్నాడు నిండు దొంగ.

ఆ రోజు రాత్రి నిండు దొంగ ఊరి చివర ఒక బడ్డి కొట్టు పెట్టుకుని, ఆ కొట్టుకు పక్కనే పడుకోడానికి రెండు పక్కలు వేసి, దీపం పెట్టుకుని, అక్కడ ఎదురు చూడడం మొదలుపెట్టాడు.

ఆ రోజు రాత్రి రాజు దొంగని పట్టుకోవాలన్న ఉద్దేశంతో గస్తీ తిరిగే భటులతోపాటూ తను కూడా వచ్చాడు.

ఊరి చివర ఉన్న ఆ బడ్డి కొట్టులోని దీపం చూసి రాజుగారూ, కొంత మంది భటులూ అక్కడికి వచ్చి ఆ పడుకోడానికి వేసి ఉన్న చాపలూ అన్నీ చూసారు. నిండు దొంగని “ఏయ్ అబ్బాయ్! ఇంత అర్ధ రాత్రి పూట ఎవరు వస్తారని నీ బడ్డి కొట్టు తెరిచి పెట్టుకున్నావు? ఆ చాపలు, దిండూ అవన్నీ ఎవరి కోసం పెట్టావు? నిజం చెప్పు” అని గద్దించాడు రాజు.

నిండు దొంగ భయపడుతూ భయపడుతూ “అయ్యా! క్షమించండి! కొన్నాళ్ళగా మన దేశంలో దొంగతనాలు చేస్తున్న ఆ దొంగలు రాత్రి పూట ఇక్కడికి వచ్చి, నేను తీసుకొచ్చిన భోజనం తిని, ఇక్కడే నిద్ర పోతారు. పొట్టకూటి కోసం ఈ బుద్ది తక్కువ పని చేసాను. నన్ను క్షమించండి” అంటూ బ్రతిమాలాడు.

"సరే! కానీ నువ్వు, మేము దొంగని పట్టుకోటానికి సాయం చేయాలి. ఏం, సరేనా?" అన్నాడు రాజు.

"అలాగే మహారాజా! కానీ మీ సైనికులంతా ఇక్కడ ఉన్నారంటే ఆ దొంగలు అట్నుంచీ అటే పారిపోతారు. కాబట్టి సైనికులని వెళ్ళి దూరంగా దాక్కోమనండి. ఈ దొంగ రాగానే సన్నగా ఈల వేస్తాను అప్పుడు వచ్చి పట్టుకోవచ్చు” అని చెప్పాడు నిండు దొంగ.

‘సరేలే’ అనుకుని రాజు ఆఙ్ఞ చేయగా సైనికులు వెళ్ళి దూరంగా దాక్కున్నారు.

ఐతే రాజు మాత్రం అక్కడే ఉన్నాడు. ఎందుకంటే మరి నిండు దొంగ నిజంగా తమని పిలుస్తాడో లేదో ఒక వేళ దొంగలతో చేతులు కలిపి తమని పిలవకపోతే?

నిండు దొంగ “మహారాజా! మీరు ఇదే వేషంలో ఇక్కడ కూర్చో నుండడం సబబు కాదు. మీరు ఇదుగో ఆ గోనె సంచీలో దాక్కోండి. కాకపోతే మీ బట్టలూ, నగలూ గుచ్చుకోకుండా ఈ మామూలు బట్టలు వేసుకోండి. అలా చేస్తే అప్పుడు దొంగ ఎవరూ ఇక్కడ లేరులే అనుకుని వస్తాడు” అని అన్నాడు.

రాజు అందుకు ఒప్పుకుని సంచీలో దూరాడు. నిండు దొంగ ఆ సంచీ మూతి బిగించి కట్టేసి రాజుగారి బట్టలూ, నగలూ తీసుకుని ఎంచక్కా తన దారిన తాను వెళ్ళిపోయాడు.

ఇంటికెళ్ళి కార్తికేయుడికి ఆ నగలు చూపగా అతను ఎంతో సంతోష పడ్డాడు.

ఇక్కడ రాజుగారు ఎంత సేపో ఎదురు చూసారు చడీచప్పుడు లేదు. కొంత సేపటికి ఆయన నిండు దొంగని పిలిచాడు. కానీ జవాబు లేదు. ఆయనకి అప్పుడు అనుమానం వచ్చి భటులను పిలవగా వాళ్ళు వచ్చి సంచీలో ఉన్న రాజుగారిని విడిపించారు.

ఏం జరిగిందో అందరికీ అర్ధం అయ్యింది. రాజుగారి పరువు నిండునా పోయింది” అని చెప్పి పయ్యెద………

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

4, ఫిబ్రవరి 2009, బుధవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] – 10

(నిన్నటి కధ తరువాయి భాగం)

మర్నాడు కార్తికేయుడు అర్ధ దొంగని పిలిచి “ఒరేయ్! నీ తమ్ముడు చేసిన దొంగ తనం చూసావుగా? నువ్వు అంతకంటే గొప్ప దొంగతనం చేసుకు రావాలి” అని చెప్పాడు.

అర్ధ దొంగ తండ్రి దగ్గర సెలవు తీసుకుని కుంతల నగరానికి వాచ్చాడు. అక్కడ వాకబు చేయగా రాజుగారు ఇచ్చిన తీర్పు గురించీ, కొత్వాల్ గురించీ తెలుసుకున్నాడు.

కొత్వాల్ కి ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. అయితే ఆ పెళ్ళి కొడుకు కాపురం చేయక మునుపే కట్నంతో దేశాంతరాలు పట్టి వెళ్ళిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న అర్ధ దొంగ దేశాంతరాల నుంచి వచ్చిన వాడిలాగా వేషం వేసుకుని కొత్వాల్ ఇంటికి వెళ్ళాడు.

"మామా! నన్ను గుర్తు పట్టలేదా? అదే నీ కూతురు వనజాక్షిని 9వ యేట పెళ్ళి చేసుకున్న నీ అల్లుడిని” అంటూ ఇంకా ఏవో తను వాకబు చేయగా తెలుసుకున్న విషయాలను కూడా చెప్పి, కొత్వాల్ ని విజయవంతంగా నమ్మించాడు. కొత్వాల్ కూడా నిజాయితీగా, దొంగని తన అల్లుడే అని నమ్మాడు.

అర్ధ దొంగ ఆ రోజంతా వాళ్ళచేత సత్కారాలు చేయించుకున్నాడు. సాయంత్రానికి కొత్వాల్ ఊళ్ళో గస్తీ తిరగడానికి బయలుదేరాడు. అర్ధ దొంగ “మామా! నాకు ఊరు చూడాలని ఉంది. ఇప్పుడెలాగో నువ్వు గస్తీ తిరగడానికి వెళ్తున్నావు కదా! నేనూ వస్తాను. దారిలో నీకు విసుగ్గా అనిపించకుండా కబుర్లు చెపుతూ ఊళ్ళో ఏ ప్రదేశంలో ఏమున్నాయో తెలుసుకుంటాను” అని అన్నాడు.

కొత్వాల్ కి కూడా ‘ఇప్పుడు ఒక్కన్నే గస్తీ తిరగడానికి వెళ్ళడం అంటే విసుగు పుడుతుంది. అదే అల్లుడిని తీసుకువెళితే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళచ్చు’ అనుకుని “సరే! రా అల్లుడూ!” అన్నాడు.

ఇద్దరూ కూడా బయలుదేరి వెళ్ళారు. కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ ఊరి మద్యలో ఉన్న గుది బండ దగ్గరికి వెళ్ళారు.

"మామా! ఏమిటిది? నేను ఎప్పుడూ దీన్ని చూడ లేదు” అని అడిగాడు అర్ధ దొంగ.

"దీన్ని గుది బండ అంటారు అల్లుడు! రాత్రి పూట ఎవరైనా దొంగలు కనుక పట్టు పడితే అప్పుడు రాజు దగ్గరకు తీసుకెళ్ళడం జరిగే పని కాదు కనుక గుది బండలో బిగిస్తారు. కాళ్ళు చేతులను సరైన పద్దతిలో అందులో దూరిస్తే చాలు దానంతట అదే తాళం పడిపోతుంది” అని చెప్పాడు కొత్వాల్. అంతా విన్న అర్ధ దొంగ కావాలనే “అవునా? భలే భలే. ఒక్కసారి ఇది ఎలా తాళం పడుతుందో చూడాలని ఉంది. చూపించవా మామా!” అంటూ చాలా గోముగా అడిగాడు.

కొత్వాల్ కూడా సరే చూపిద్దాం అనుకున్నాడు. ‘కానీ ఆ రోజే దేశాంతరాల నుంచీ వచ్చిన అల్లుడిని దొంగలను పెట్టే గుదిబండలో పెడితే బాగుండదు’ అని ఆలోచించిన కొత్వాల్ “సరే! నేను గుదిబండలో నన్ను నేను తాళం వేసుకుంటాను. నువ్వు చూద్దువు గానీ” అని చెప్పి తనను తను దాంట్లో ఇరికించుకున్నాడు. అది తాళం పడింది. అర్ధ దొంగ తెగ సంబర పడిపోయినట్టు నటించాడు.

"సరే అల్లుడు ఇప్పుడు నా జేబులోని తాళం చెవి తోటి తాళం తెరువు” అని అన్నాడు.

అయితే అర్ధ దొంగ తాళం చెవి అతని జేబులోంచి తీసినట్టే తీసి ఎక్కడో పడేశాడు. “అయ్యో! మామా తాళం చెవి పొరపాటున ఎక్కడో పడిపోయింది. కనిపించడం లేదు” అని అన్నాడు.

"సరే! అయితే ఒక పని చేయి. ఇంటి దగ్గర ఇంకొక తాళం చెవి ఉంది. మీ అత్తని అడిగి అది తీసుకురా” అని చెప్పాడు కొత్వాల్.

అర్ధ దొంగ కొత్వాల్ భార్య దగ్గరకి వెళ్ళి, "అత్తా! మామ చెప్పాడు. ఊరిలో దొంగలు మరీ ఎక్కువ అయిపోయారు అంటకదా. అందుకని డబ్బు, నగలు, విలువైన వస్తువులూ అన్నీ కూడా మూటకట్టి ఇమ్మన్నాడు” అని చెప్పాడు. అదంతా విన్న కొత్వాల్ భార్య “ఆయన ఏరీ?" అని అడిగింది. అందుకు జవాబుగా అర్ధ దొంగ “పక్క వీధిలో ఉన్న గుదిబండ దగ్గర ఉన్నాడు” అని చెప్పాడు. వెంటనే కొత్వాల్ భార్య ఆ వీధి చివరికి వచ్చి “ఏవండీ ఇవ్వమంటరా?” అని ఒక గావు కేక పెట్టింది.

అక్కడ కొత్వాల్ ఏమో ఆమె అడుగుతుంది తాళం చెవి గురించి అనుకుని “ఇవ్వు ఇవ్వు! తొందరగా!” అని అరిచాడు. ఆవిడ డబ్బూ దస్కం నగలూ నట్రా అన్నీ కూడా బస్తాలకి బస్తాలు కట్టి ఇచ్చింది. అర్ధ దొంగ అవి అన్నీ తీసుకుని కొత్వాల్ ఉన్న వైపునుండీ కాకుండా వేరే వైపునుండీ మాతంగ పురానికి వెళ్ళి పొయాడు.

ఇంటికెళ్ళాక కార్తికేయుడికి తను దొంగిలించిన వైనం అంతా చెప్పి ఆ సంపదనంతా చూపించాడు అర్ధ దొంగ. ఇప్పటి తల్లి దండ్రులు ఎలాగైతే పిల్లలు చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుంటే ఆనంద పడతారో అలాగే కార్తికేయుడు కూడా అనంద పడ్డాడు.

ఇక్కడ కుంతల నగరంలో ఏమో కొత్వాల్ ఎదురు చూసాడు, ఎదురు చూసాడు. ఎంత సేపటికీ అల్లుడు రాడాయే! అప్పుడు అతనికి ‘ఎక్కడో ఏదో తప్పు జరిగింది’ అని మాత్రం అర్ధం అయ్యింది. కానీ ఏం జరిగిందో మాత్రం అర్ధం కాలేదు. ఏం చేయడానికీ తోచక అలాగే ఉండిపొయాడు. తెల్లవారాక జనాలు కొత్వాల్ గుదిబండలో ఇరుక్కుని ఉండడం చూసారు. కొత్వాల్ భార్య విషయం తెలుసుకుని పరుగు పరుగున వచ్చి తాళం చెవి తోటి తాళం తీసింది. ఆవిడ జరిగిందంతా భర్తకి వివరించింది. విషయం అందరికీ తెలిసి పోయింది.

రాజు గారు విషయం తెలుసుకుని కొత్వాల్ ని చడామడా తిట్టాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

2, ఫిబ్రవరి 2009, సోమవారం

పలుకని పడంతి [విక్రమార్కుడి కధ] - 9

(నిన్నటి కధ తరువాయి భాగం)

అప్పుడు చీర కొంగు “ఓ రాజా! ఇప్పుడు నా ప్రాణం నా బొందిలో సరిగ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు కధ చెప్పగలను. వినండి.

నలుగురు దొంగల కధ

కుంతల నగరం అనే ఒక దేశం ఉండేది. ఆ దేశాన్ని గోపాలవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి గోలాహలుండు అనే మంత్రి ఉన్నాడు.

కుంతల నగరానికి రెండామడల దూరంలో మాతంగ పురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కార్తికేయుడు అనే ఒక పెద్ద గజదొంగ ఉండేవాడు. అతనికి నలుగురు కొడుకులు. మొదటివాడి పేరు నిండు దొంగ, రెండోవాడి పేరు ముప్పావు దొంగ, మూడోవాడి పేరు అర్ధ దొంగ, నాలుగోవాడి పేరు పావు దొంగ.

ఒక రోజు కార్తికేయుడు కొడుకులను పిలిచి “చూడండి నాన్నా! మీ అందరికీ నేను చోర విద్య నేర్పాను. ఇప్పుడు మిమ్మల్ని పరిక్షించాలి అనుకుంటున్నాను. నాయనా! పావు దొంగా! మన ఊరికి రెండు ఆమడల దూరంలో కుంతల నగరం అనే ఊరు ఉంది. రేపు తెల్లవారే లోపల ఆ ఊరిలో ఏదైనా దొంగిలించి తీసుకురావాలి. చూద్దాం నీ దగ్గర ఎంత సామర్ధ్యం ఉందో!” అన్నాడు కార్తికేయుడు.

తండ్రి దగ్గర సెలవుతీసుకొని కుంతల నగరానికి వచ్చాడు పావు దొంగ.

పావు దొంగ ఒక మంగలి కొట్టుకి వెళ్ళాడు. అప్పటికే మంగలివాడు వేరే అతనికి క్షౌరం చేస్తున్నాడు. పావుదొంగ అతనితో “మంగలీ! నాకు ముందర క్షౌరం చేయి. నేను తొందరగా వెళ్ళాల్సి ఉంది. కావాలంటే అందరూ నీకు క్షౌరం చేసినందుకు ఇచ్చే డబ్బుకు రెట్టింపు ఇస్తాను” అని చెప్పాడు.

మంగలివాడు అప్పుడు తను క్షౌరం చేస్తున్నవాడిని బ్రతిమాలి సగంలో ఓ పక్కన కూర్చొపెట్టి పావు దొంగకి క్షౌరం చేసాడు. క్షౌరం అయిపోయాక పావు దొంగ “నా దగ్గర చిల్లర లేదు. నీ దగ్గర ఉందా?" అని అడిగాడు. అతనికి తెలుసు ఉదయాన్నే, అప్పుడే అంగడి తెరిచారు కనుక చిల్లర ఉండే ఆస్కారం లేదని. అయినా అడిగాడు. లేదని క్షురకుడు చెప్పగానే “సరే అయితే నీ కొడుకునో, పనివాడినో ఎవరినో ఒకరిని నా వెంట పంపు. అంగళ్ళ వీధిలో ఎక్కడన్నా చిల్లర మార్చి పంపిస్తాను. నువ్వు వస్తే ఇందాక సగం క్షౌరం చేయించుకున్న అతను గొడవ పెడతాడు” అని అన్నాడు.

మంగలివాడు తన అయిదేళ్ళ తన కొడుకుని పిలిచి పావు దొంగ వెంట పంపాడు. పావు దొంగ ఆ పిల్లవాడ్ని తీసుకుని అంగళ్ళ వీధిలోకి వెళ్ళాడు. అక్కడున్న ఓ ఖరీదైన బట్టల దుకాణంలోకి వెళ్ళి, ఆ అంగడి యజమానిని ఖరీదైన బట్టలు చూపించమని చెప్పాడు. రత్నాలు పొదిగిన చీరలు, బంగారు తీగలతో కుట్టిన పంచలు ఇంకా ఏవేవో ఖరీదైన బట్టలు తీసుకుని

"మా ఇంట్లో వాళ్ళకి చూపించి రావాలి. ఇదుగో వీడు నా కొడుకు. వీణ్ణి నీ దగ్గరే ఉంచి వెళుతున్నాను. ఈ బట్టల్లో వాళ్ళు వద్దన్న బట్టలూ, పైకం తీసుకుని వస్తాను. అప్పుడు నా కొడుకుని తీసుకు పోతాను” అని చెప్పి బట్టలు తీసుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు.

కార్తికేయుడి దగ్గరకెళ్ళి తను చేసిన దొంగ తనం చూపించాడు. కార్తికేయుడు ఎంతగానో మెచ్చుకున్నాడు.

అయితే ఇక్కడ కుంతల నగరంలో ఆ బట్టల అంగడి యజమాని మంగలివాడి కొడుకుని “ఏరా నీ నాన్న ఏడీ? ఎంత సేపటికీ రాడు!” అన్నాడు.

ఆ పిల్లవాడు “మా నాన్న క్షౌరం చేస్తున్నాడు” అని చెప్పాడు. అసలే ‘అంత ఖరీదైన బట్టలు తీసుకెళ్ళిన వాడు ఇంతవరకూ రాలేదే’ అని కంగారుగా ఉన్న అతనికి ఆ సమాధానం వినగానే చిర్రెత్తింది.

"ఏరా పరిహాసాలాడుతున్నావా?" అంటూ కసిరాడు.

అయితే ఇతను కసిరే టప్పటికి భయపడిన ఆ పిల్లవాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు.

ఇంతలో ‘తన కొడుకు ఏమయ్యాడా?’ అని అంగళ్ళ వీధికి వచ్చిన మంగలివాడు అతని కొడుకుని చూసి “నా కొడుకుని ఎందుకు నిర్భందించావు? వాడిని వదిలేయి” అన్నాడు.

అయితే బట్టల దుకాణం వాడు “ఏమి, నువ్వు అతను తోడుదొంగలన్నమాట!” అంటూ అతను ఎదురు కొట్లాడాడు.

వీళ్ళు కొట్లాడుకుంటుండగా అటుగా వచ్చిన రాజ భటులు వాళ్ళని రాజుదగ్గరికి తీసుకెళ్ళారు. రాజు అంతా విని విషయం వాకబు చేయగా రాజుగారికి అంతా అర్ధం అయ్యింది. రాజుగారు “వాడిని పట్టుకొంటాము. అయినా ఎవ్వడిని పడితే వాడిని అలా ఎలా నమ్మారూ? మీ బుద్ది తక్కువ తనం” అని ఇద్దరినీ తిట్టి

"ఏయ్ కొత్వాల్! పట్టపగలే ఇలా దొంగతనాలు జరుగుతుంటే నువ్వేమి చేస్తున్నావయ్యా? ఆ దొంగని ఎలా పట్టుకుంటావో నాకు తెలియదు కానీ పట్టుకొని తీరాలి. అర్ధమైందా?" అని చెప్పేసి తన పనిలో తను మునిగిపోయాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)