21, జనవరి 2009, బుధవారం

పలుకని పడంతి (విక్రమాదిత్యడి కధ) - 3

(నిన్నటి కధ తరువాయి భాగం)

విక్రమార్కుడు దీపాలనాగిని నిశితంగా పరిశీలించాడు. దీపాలనాగి అంత గొప్ప అందాలరాశి కాదు. అప్పుడు విక్రమార్కుడికి అనుమానం వచ్చింది. ‘పలుకని పడంతి కోసం రాజులూ, మహారాజులూ కూడా వరించాలని ప్రయత్నించి, అవమానపడ్డారని’ అవ్వ చెప్పింది. ఆమె చెప్పింది నిజం ఐతే ఈమె అపురూప సౌదర్యరాశి అయ్యుండాలి. కానీ అలాగ కనిపించటం లేదు ఈ వచ్చిన అమ్మాయి. దానికి తోడు ఈమె దీపాల పట్ల చూపిస్తున్న శ్రద్ధని గమనిస్తుంటే (అంటే అమృతమోహినితోపాటు ఆ గదిలోకి వచ్చినప్పుడు దీపాలనాగి చేతిలో ఒక పళ్ళెం పట్టుకుని అందులో దీపాలు పెట్టుకుని. వయ్యారంగా వచ్చింది.) ఈమె ఏ దీపలనాగో ఇంకెవరో ఇంకెవరో లాగా ఉందే? కానీ ఎలా తెలుసుకోవడం?’ అని విక్రమార్కుడు ఆలోచించాడు.

విక్రమార్కుడికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే బెతాళుడికి తను ఏం చేయాల్సి ఉంటుందో అర్ధం అయిపొయింది. కానీ విక్రమార్కుడు భట్టికి తన ఆలోచనని ఇలా వివరించాడు. “తమ్ముడూ! బెతాళుడు ఇప్పుడు గాలి ఊదుతాడు. దాంతో దీపాలు కొండెక్కుతాయి. దీపాలు రెపరెపలాడగానే వత్తి సరిచేయడానికి ఆమె వేలిని నూనెలో పెట్టి వత్తిని సరిచేస్తుంది. అలా సరి చేసాక ఆమె వేలికి అంటిన నూనెని వేరే గుడ్డతో తుడుచుంకుందంటే ఆమె పలుకని పడంతి అని అర్ధం. లేక జుట్టుకి తుడుచుకుందంటే ఆమె దీపాలనాగి అని అర్ధం. ఎందుకంటే యజమానురాలైతే ఇంత డబ్బుండీ మరీ అంత తలకు మాసిన అలవాట్లు ఉండవు జుట్టుకి నూనెని పూసుకోవడానికి. కనుక ఈ పని ద్వారా మనకి అర్ధం అవుతుంది ఈ వచ్చిన ఆమె ఎవరో” అన్నాడు.

బెతాళుడు అలాగే దీపాలను గాలి ఊది కొండెక్కించాడు. వెంటనే దీపాలనాగి వేలితో దీపపువత్తిని పైకి అని, ఆ నూనెని తలకి రాసుకుంది. అంతే, విక్రమార్కుడు వెంటనే “ఒహో! మీరందరూ కలిసి నన్ను మోసపుచ్చాలను కుంటున్నారా? ఓసీ దీపాలనాగీ! నీ యజమానురాలు గనకా వస్తే ఆమె కాళ్ళు అరిగిపోతాయా, లేక అందం కరిగి పోతుందా? నువ్వు వెళ్ళి ఆమెని రమ్మను” అన్నాడు.

అమృతమోహిని తమ పధకం పారనందుకు బాధగా, దీపాలనాగిని లోపలికి తీసుకెళ్ళి ఈ సారి ఇలాకాదు అనుకుని, వంటల రంగమ్మను అచ్చం తన కూతురిలా అలంకరించి తీసుకెళ్ళింది.

ఈ లోపల విక్రమార్కుడికీ, భట్టికీ అతిధి సత్కారాలు చేయాలి కదా! అందుకని ఇద్దరికీ చక్కని విందు వడ్డించారు. వంటల రంగమ్మరాగానే విక్రమార్కుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఈమె మరీ అంత అందంగా ఏమీ కనిపించడం లేదు ఖచ్చితంగా ఈమె పలుకని పడంతి కాదు. సరే! పరిక్షించి చూద్దాం అనుకుని “ఓ పలుకని పడంతి! నీ కోసం ఎంతో కష్టమైనా ఇన్ని ప్రాకారాలూ దాటుకుని వచ్చాను. నా కోసం నీ అమృత తుల్యమైన చెయ్యితో వడ్డించవా!" అన్నాడు.

వంటల రంగమ్మ విందు వడ్డించుతుండగా, నెయ్యి గిన్నెని విక్రమార్కుడు పొరపాటున దొర్లించినట్టు దొర్లించాడు. వంటల రంగమ్మ క్రింద పడ్డ నెయ్యినే మళ్ళీ గిన్నెలోకి తీసింది. వెంటనే విక్రమార్కుడికి అర్ధం అయ్యింది ‘ఈమె ఎవరో వంటల రంగమ్మ. పలుకని పడంతి అయ్యి ఉండుంటే ఖచ్చితంగా కొత్త నెయ్యి తెప్పిస్తుంది గానీ, ఇలా క్రింద పడ్డది తీయదు’ అని. వెంటనే
"ఓ వంటల రంగమ్మా! నీవు వెళ్ళి నీ యజమానురాలిని పిలుచుకురా! నేను వచ్చింది ఆమెని వివాహ మాడటానికి కానీ నిన్నుకాదు” అన్నాడు.

ఇంక ఏమీ చేయలేక వంటల రంగమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అమృతమోహిని లోపలికెళ్ళి, పలుకని పడంతితో “ఇక తప్పేట్టు లేదు తల్లీ! ఇత నెవరో అసాద్యుడు లాగా ఉన్నాడు. నువ్వు రాక తప్పేట్టు లేదు. కానీ ఏదేమైనా నువ్వు మాత్రం ఎట్టి పరిస్తుతుల్లో మాట్లాడకు” అని చెప్పింది. పలుకని పడంతి సరే అంది.

అమృతమోహిని విక్రమార్కుడి దగ్గరకొచ్చి “రాజాధిరాజా! వినండి. నేను నా కూతురిని తీసుకొస్తున్నాను కానీ ఆమెకీ మీకూ మధ్య ఒక అడ్డు తెర కట్టి ఉంటుంది. మీరు తెల్లవారేలోపల ఆమెని మూడు సార్లు మాట్లాడించాల్సి ఉంటుంది” అని చెప్పింది.

విక్రమార్కుడికి, పలుకని పడంతికీ కూర్చోడానికి మంచాలు వేసి మద్యలో ఒక తెరగుడ్డ కట్టారు. పలుకని పడంతి విక్రమార్కుడి ముందునుంచే వెళ్ళి తెరగుడ్డకి అవతలి వైపున కూర్చుంది. ఆమె అందాన్ని చూసాక విక్రమార్కుడికి అనిపించింది ‘ఖచ్చితంగా ఈమే పలుకని పడంతి. ఈ సారి ఎలాంటి మోసాలూ చేయలేదు’ అని.

విక్రమార్కుడు “ఓ లావణ్యవతి! నీ కోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. నీ మధురామృత పలుకులను వినాలని కోరుకుంటున్నాను” అన్నాడు. కానీ పలుకని పడంతి మౌనముద్ర వేసుకుని మాట్లాడకుండా కూర్చుంది.

ఈమెని మాట్లాడించాలంటే ఇలా కాదు. ‘దానికి ఒక్కటే దారి, రహదారి’ అనుకున్నాడు, అనుకుంటా విక్రమార్కుడు ఒక చక్కని పధకం రచించాడు (బుర్రలోనే లేండి). మరి విక్రమార్కుడు తనకు చెప్పబోయే పనిని కూడా, చెప్పించుకోకుండానే అర్ధం చేసుకోగల బెతాళుడు సంసిధ్ధుడైపోయాడు.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

3 కామెంట్‌లు:

అసంఖ్య చెప్పారు...

కథరసకందాయంలో పడింది...

అజ్ఞాత చెప్పారు...

మంచి కథలను అందిస్తున్నారు. మీ కృషికి అభినందనలు.

మధురవాణి చెప్పారు...

ఆహా.. ఎంత బావుందీ కథ..! త్వర త్వరగా మొత్తం చదివేయ్యాలనిపిస్తుంది.
ఇంత మంచి మంచి కథలను మాకు చెప్తున్నందుకు నిన్ను చాలా అభినందించాలి గీతా..!