7, జనవరి 2009, బుధవారం

చిలుక పరకాయప్రవేశం – 1

విక్రమార్కుడి గురించి మన అందరీకి తెలుసు. ఆయన 6 నెలలు రాజ్యపాలన, 6 నెలలు దేశాటన చేసేవాడు. కానీ ఆయన దేశాటనలో ఎన్నో వింతలు జరిగేవి. మామూలుగా ఇప్పుడు మనకి అందుబాటులో ఉండే ఏ పుస్తకంలో ఐనా కధలు చాలా సాదాసీదాగా ఉంటాయి. నాకు ఎంతగానో గాలించగా దొరికిన ఒక అరుదైన పుస్తకంలోని ఒక అరుదైన కధ మీకు చెప్పాలని అనుకుంటున్నానండి.

విక్రమాదిత్యుడి దగ్గర ఒక మంగలివాడు పనిచేసేవాడు. వాడు తన పనిలో గొప్ప నిపుణుడు. వాడి పనితనం విక్రమార్కుడికి ఎంతగానో నచ్చడం వల్లన వాడితో స్నేహం పెరిగి, చివరికి వాడికి పరకాయప్రవేశ విద్య (మన ఆత్మని ఒక నిర్జీవమైన శరీరంలోకి పంపగలిగే విద్య. ఈ విద్య నిజంగా ఉందా లేదా అన్నది పక్కన పెట్టి, మనం కధలో ముందుకు పోదాం.) నేర్పించాడు. భట్టి (విక్రమార్కుడి తమ్ముడు) ఎన్నోసార్లు అన్నగారిని హెచ్చరించాడు, "ఆ మంగలి మంచివాడు కాదు! వాడితో స్నేహం మీకు తగదు అన్నయ్యా!” అని, కానీ విక్రమార్కుడు అంతగా పట్టించుకో లేదు.

ఒకసారి దేశాటనకి వెళ్ళేటప్పుడు విక్రమార్కుడు ఆ మంగలిని కూడా తనతోపాటూ తీసుకెళ్ళాడు. వాళ్ళు ఇద్దరూ చాలా దూరం ప్రయాణించి చివరికి కొంత సేపటికి అలిసిపోయి. ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు.

విక్రమాదిత్యుడు, మంగలివాడి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో మిక్రమార్కుడి దృష్ఠిని ఎదురుగా ఉన్న చెట్టుపైని దృశ్యం ఆకర్షించింది.

ఆ చెట్టుపైన ఒక గూడు ఉంది. ఆ గూటిలో ఒక చిలుక జంట నివసిస్తుంది. ఆ జంటలోని మగచిలుక ఏదో జబ్బు చేసి చనిపోయింది. ఆ చిలుక శవం మీదపడి ఆడచిలుక ఏడుస్తుంది. ఈ దృశ్యం చూడగానే విక్రమార్కుడి మనసు కరిగిపోయింది. పడుకున్నవాడు పడుకునే, ఉన్నపళాన పరకాయప్రవేశ మంత్రం చదివి మగచిలుక శరీరంలోకి ప్రవేశించాడు. దాంతో ఆడచిలుక ఆనందంతో ఒకటే అరిచింది. రెక్కలు టపటపలాడించింది. గాలిలో ఏవేవో విన్యాసాలు చేసింది.

ఇదంతా గమనించిన మంగలికి అనుమానం వచ్చింది. ‘చచ్చిన చిలుక మళ్ళీ బతకడమేమిటా’ అని. వెంటనే విక్రమార్కుడి శరీరాన్ని కదిపి చూసాడు. శరీరంలో కదలిక లేదు. దాంతో వాడి అనుమానం నిజమైంది. వాడు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న క్షణం అప్పుడు వచ్చింది. అలాంటప్పుడు వాడు ఆగుతాడేంటి? హడావుడీగా పరకాయప్రవేశ మంత్రం జపించి తన ఆత్మని విక్రమాదిత్యుని శరీరంలోకి ప్రవేశపెట్టి. తన శరీరాన్ని కాల్చేసి, అక్కడ నుండి ఉజ్జయినికి బయలుదేరాడు.

అన్నగారి రాక తెలుసుకుని భట్టి ఎదురేగి సాదరంగా స్వాగతం ఇచ్చాడు కానీ, భట్టి మనసులో మాత్రం అనుమానం కలిగింది, "వచ్చింది విక్రమార్కుడు కాదు. తన అన్నగారు ఎప్పుడూ కూడా 6 మాసాల దేశాటన కాలం దాటక మునుపురారు, కనుక ఈ వచ్చిన వాడు నా అన్నకాదు తన అన్నరూపంలో వచ్చిన మాయావి” అని అర్ధం చేసుకొన్నాడు. వెంటనే విక్రమార్కుడి భార్యలకి రహస్యంగా కబురు పంపాడు. “వచ్చినవాడు విక్రమాదిత్యుడు కాడని నా అనుమానం. ఎందుకైనా మంచిది మీరు దేవీ పూజ చేస్తున్నామనీ, మగవారిని చూడరాదని, కాబట్టి మీ మందిరాలకి రావద్దని ఆయనకి కబురు పంపండి” అన్నది దాని సారాంశం. ఆ రాణులంతా భట్టి మీద ఉన్న నమ్మకంతో అలాగే చేసారు.

భట్టి విక్రమార్కుడి శరీరంలోని మంగలివాణ్ణి గమనిస్తూనే ఉన్నాడు. తిండి తినేటప్పుడూ, రాచ మందిరంలో తిరిగేటప్పుడూ ఒక రకమైన ఆబతనం గమనించాడు. ఇంతలో భట్టికి గుర్తుకు వచ్చింది అన్నగారితో పాటూ దేశాటనకి వెళ్ళిన మంగలివాడి గురించి. వాడి గురించి వాకబు చేయగా ‘వాడు తిరిగి రాలేదని’ తెలుసుకున్నాడు. వెంటనే భట్టికి అర్ధమైంది. ‘అన్నగారు నేర్పిన పరకాయప్రవేశ విద్యతోటి మంగలివాడు విక్రమార్కుడి శరీరంలో ప్రవేశించాడని’ అర్ధమైంది, కానీ అన్నగారు ఏమయ్యారో, అసలు ఆయన తన ఆత్మను ఏ శరీరంలో ప్రవేశపెడితే మంగలివాడు విక్రమార్కుడి శరీరంలో ప్రవేశించాడో మాత్రం ఆయనకి అర్ధం కాలేదు. ఆయన అనుమానాలకి సమాధానం త్వరలోనే దొరికిద్దని ఆయన ఊహించాడో లేదో మనకి తెలీదు కానీ మీ అనుమానాన్ని మాత్రం నేను తదుపరి టపాలలో తీరుస్తానండి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

chaalaa kashtamgaa undi chadavadam. kaasta template, color maarchandi plss.

karthik చెప్పారు...

namaste andi..
manchi post chesaru. I'm reading all your blog contents one by one. really gud ones.

continue the gud work.

-Karthik