20, జనవరి 2009, మంగళవారం

పలుకని పడంతి (విక్రమాదిత్యడి కధ) - 2

(నిన్నటి కధ తరువాయి భాగం)

విక్రమార్కుడు పందెం కాశాక వాకబు చేయగా పలుకని పడంతి భవనం దగ్గర మొదటి ప్రాకారంలో పనిచేసే కరణాలలో ఒకడు చాలా చెడ్డవాడు అని తెలుసుకున్నాడు.

ఆ రోజు రాత్రి విక్రమార్కుడు, భట్టి కలిసి పలుకని పడంతి భవనం దగ్గరకెళ్ళారు. మొదటి ప్రాకారంలోకి ప్రవేశించడానికి 1000 హొన్నులిచ్చి విక్రమార్కుడు, భట్టి లోపలికి ప్రవేశించారు. వెంటనే ఇద్దరు కరణాలు విక్రమార్కుడికి భోజనం వడ్డించారు. మరి విక్రమార్కుడు మాత్రమే పలుకని పడంతిని ఓడించడానికి వచ్చింది. భట్టి తోడు వచ్చాడు అంతే. ఎటువంటి మాటసాయం కూడా భట్టి చేయడు కనుక వాళ్ళు భట్టికి భోజనం పెట్టలేదు.

విక్రమార్కుడు ఆ భోజనంలోని ఉడికిన అన్నాన్ని తను తిన్నాడు. ఉడకని అన్నాన్ని ఒక కండువాలో వేసుకున్నాడు. అలాగే ఒలిచిన పండు తిన్నాడు. ఒలవని పండు కండువాలో వేసుకున్నాడు. ప్రతి ఒక్కటీ కూడా అలాగే కండువాలో వేసుకున్నాడు.

విక్రమార్కుడు భోజనం అయిపోగానే కరణం వాడితో స్నేహం చేసుకున్నాడు. ముగ్గురూ కలిసే రెండో ప్రాకారంలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళగానే విక్రమార్కుడు కరణం వాడిని మర బొమ్మల చేతికి అప్పగించాడు. రెండు నిముషాలలో మూడు బొమ్మలూ కలిసి వాడికి గుండు గీసినయ్. వాడు విక్రమార్కుడితో గొడవ పడ్డాడు. చెవిదగ్గర జోరీగలాగా వాడు నసపెట్టేటప్పటికి ఇక ఇలా కాదులే అనుకుని, విక్రమార్కుడు మూడో ప్రాకారంలోని మల్లయొధులకి కరణం వాడిని అప్పగించాడు. అలా మల్లయోధులు వీళ్ళ జోలికి రాలేదు కనుక భట్టి, విక్రమార్కుడు ఇద్దరూ నాలుగో ప్రాకారంలోకి ప్రవేశించాడు. అక్కడ నల్లకోతి ఉంది. విక్రమార్కుడు మొదటి ప్రాకారంలో మూటకట్టిన అన్నాన్ని దాని ముందు ఉంచాడు. కానీ ఆ కోతి అన్నాన్ని గమనించనట్టుగా కదలక మెదలక ఉంది. జాగ్రత్తగా దానిని గమనించాక వాళ్ళకు అర్ధమైంది ఆ కోతి నిజం కోతి కాదు, బొమ్మ అని. వెంటనే చప్పుడు చేయకుండా ఆ కోతి దగ్గరకెళ్ళి దాన్ని విరగ్గొట్టేశాడు విక్రమార్కుడు. తరవాత అయిదవ ప్రాకారంలో కూడా ఇలాగే పులి ముందల ఉదకని కూరని పెట్టాడు. ఆ పులి కూడా కూరని ముట్టుకోలేదు. వెంటనే పులి రూపంలో ఉన్న ఆ యంత్రాన్ని కూడా విరగ్గోట్టేశాడు. తరవాత ఆరవ ప్రాకారంలోని ఏనుగును కూడా అంతే. దానికి ఒలవని పండు పెట్టారు. ఆ ఏనుగు పండును తినలేదు. అది యంత్రం అని అర్ధం చేసుకొని విరగ్గొట్టేశాడు. ఇక ఏడవ ప్రాకారంలో ఒక బావి అడ్డంగా ఉంది. ఆ బావిని దాటి ఎటూ వెళ్ళడానికి లేదు. విక్రమార్కుడు చుట్టూ చూసాడు. ఒక పెద్ద రాయి కనబడింది. బాగా ఆలోచించి చివరికి ఆ పెద్దరాయిని తీసుకొని బావిలో వేశాడు. అంతే, బావిమీద రెండు పలకలు వచ్చి మూసుకున్నాయి. విక్రమార్కుడు, భట్టి ఆ పలకల మీద నడుచుకుంటూ అవతల పక్కకి వెళ్ళి పోయారు. తరవాతటి ఎనిమిదవ ప్రాకారంలో బురద మడుగు ఉంది. ఆ మడుగుని చూస్తూ భట్టి,
"అన్నా! నువ్వు పలుకని పడంతిని వరించాలి అనుకుంటున్నావు, కనుక నువ్వు బురదలో నడుచుకుంటూ రావాలి. నేను మాత్రం బెతాళుడి మీద అవతలకి వెళ్ళిపోతున్నాను” అని చెప్పి, విక్రమార్కుడి అనుమతితో బెతాళుడి మీద ఎక్కి మడుగుకు అవతలి వైపుకి వెళ్ళాడు.

తరవాత విక్రమార్కుడు బురదలో నడుచుకుంటూ అవతల వైపుకి వెళ్ళాడు. అక్కడ నత్తగుల్లలో నీళ్ళున్నాయి. విక్రమార్కుడు బాగా ఆలోచించి, కొంచెం గట్టిగా ఉన్న తాటి ఆకుతో కాళ్ళకి అంటుకున్న బురదనంతా గీకేశాడు. తరవాత ఒక రుమాలుని నత్తగుల్లలోని నీళ్ళతో కొంచెం తడిపి ఇంకా నత్తగుల్లలో సగం నీళ్ళు మిగిలేలాగా చూసుకున్నాడు. ఆ తడిపిన రుమాలుతో కాళ్ళని శుబ్రంగా తుడిచాడు. ఇప్పుడు విక్రమార్కుడి కాళ్ళు శుబ్రంగా, అచ్చం కడుక్కున్న కాళ్ళలాగా మెరిసిపోతున్నాయి.

తరవాతటి తొమ్మిదవ ప్రాకారంలో స్పటిక మండపం ఉంది. విక్రమార్కుడు తనతోపాటూ చెచ్చుకున్న కొవ్వొత్తులని కరిగించి, ఆ మండపంలో తను వెళ్ళాల్సిన దారి మొత్తం ఆ మైనాన్ని పోస్తూ దాని మీద నడవసాగాడు. అప్పుడు కొవ్వొత్తి పడ్డచోటు వరకూ గరుకుగా ఉండటం వల్ల క్రింద పడరు కదా! విక్రమార్కుడి వెనకే భట్టి కూడా మైనం మీద నడుస్తూ అన్నగారిని అనుసరించాడు.

తరవాతటి ప్రాకారంలో చిమ్మచీకట్లు కమ్మిన 1000 స్తంబాల మండపం ఉంది. విక్రమార్కుడు భట్టితో,
"తమ్ముడూ! బెతాళుడు భ్రమర రూపంలోకి మారి నిన్ను తన వీపు మీద ఎక్కించుకుని సరైన దారిలో వెళతాడు. నేను ఆ భ్రమర శబ్ధాన్ని బట్టీ మీ వెనకే వస్తాను” అని చెప్పాడు.

వెంటనే బేతాళుడు భ్రమర రూపంలోకి మారాడు. భట్టి బెతాళుడి మీద బయలుదేరాడు. శబ్ధాన్ని బట్టీ విక్రమాదిత్యుడు వాళ్ళని అనుసరించాడు. అలా వాళ్ళు ఆ మండపంలోంచి బయటికి వచ్చారు.

తరవాత పలుకని పడంతి భవనం వచ్చింది. మొదటి గదిలోకి వెళ్ళిన విక్రమార్కుడు. మంచాన్ని ఒక క్షణం జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ మంచం రెండు వైపులా ఒకేలాగా ఉంది. ఎక్కడా ఎటువైపు పైన, ఎటుపైపు క్రింద అన్నది కనిపెట్టడానికి అవకాశం లేదు. విక్రమార్కుడు ఒక నిమ్మకాయ తీసుకుని మంచానికి సరిగ్గా మద్యలో ఆ నిమ్మకాయని పెట్టాడు. నిమ్మకాయ ఒక వైపుకు దొర్లేసింది. మామూలుగా ఎక్కడైనా సరే మంచానికి కాళ్ళకట్టన కొంచెం క్రిందకూ, తలవైపున కొంచెం ఎత్తుగానూ ఉంటాయి. కాబట్టి నిమ్మకాయ దొర్లిన వైపు ఖచ్చితంగా కాళ్ళకట్టనే అనుకుని, అటు వైపు కాళ్ళు, దానికి వ్యతిరేకదిశలో తల పెట్టి పడుకున్నాడు విక్రమార్కుడు.

వెంటనే 10 మర బొమ్మలు ప్రత్యక్షం అయ్యి సపర్యలు చేస్తూ మరిపించె ప్రయత్నం చేసాయి. కానీ వాటిని పట్టించుకోకుండా విక్రమార్కుడు ముందలికి వెళ్ళిపోయాడు.

ఇవన్నీ ముందలే తెలుసుకుంటూ ఉన్న పలుకని పడంతి, అమృతమోహిని చివరికి విక్రమార్కుడు ఈ మంచం విషయంలో కూడా నెగ్గాడు అనగానే “అయ్యో! మనము ఇన్నాళ్ళు ఆడిన ఆటలన్నీ ఇంక ఈ రోజు కట్టిపెట్టాల్సి వస్తుందో ఏం పాడో” అని తెగ బాధ పడ్డారు.

ఎంత బాధ పడ్డాకూడా అమృతమోహిని నవ్వుతూ విక్రమార్కుడిని ఆహ్వానించింది “విశ్రాంతి తీసుకోండి. అమ్మాయి వస్తుంది” అని చెప్పి పలుకని పడంతి దెగ్గరకెళ్ళి “అమ్మాయీ! నువ్వు ఒక పని చేయి! దీపాలు వెలిగించే పని మనింట్లో చేసే దీపాలనాగికి అచ్చు నీలాగా అలంకరించు. వీలైనంత అందంగా అలంకరించు, దీపాలనాగినే వాళ్ళ ముందుకు పంపించి ఈమే పలుకని పడంతి అని చెప్తాను” అని చెప్పింది.

దీపాలనాగిని పలుకని పడంతి లాగే అలంకరించి అమృతమోహిని “ఈమే నా కూతురు పలుకని పడంతి” అని పరిచయం చేసింది.

(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది .....తరువాతి టపా కోసము ఎదురుచూస్తుంటామని మరువవద్దు....