(నిన్నటి కధ తరువాయి భాగం)
తంత్రలోహనుడు చిలుకలకి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న చిలకల గుంపులోంచి ఒక చిలుక సురేంద్రుడి దగ్గరకి వచ్చి, "మహారాజా! ఆ గోరు గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఇతను అన్నాక గుర్తువచ్చింది. కొన్నాళ్ళ క్రితం మేము అందరం సప్తసముద్రాలు దాటి సప్తద్వీపాలకి అవతల ఉండే మధువనంలోని అద్భుతమైన ఫలాలను తిన్నాము. తిరిగి వచ్చేటప్పుడు, మీ కోసం అని అందరం కూడా మేము తీసుకురాగలిగినన్ని ఫలాలను తీసుకొస్తున్నపుడు. మల్లికా ద్వీపంలో సూర్యాస్తమయ వేళలో ఏడు అంతస్తుల భవనం మీద మేనకా, రంభల లాంటి అపూర్వ సౌందర్యరాశి తల చిక్కుతీసుకుంటుండగా జుట్టుకు చిక్కుకుని ఆమె గోరు దూరంగా పడ్డది. నేను మెరుస్తున్న ఆ గోరుని వజ్రం అనుకున్నాను. ఆమె ఉంగరం నుంచీ వజ్రం జుట్టుకు చిక్కుకుని దూరంగా పడింది కాబోలు అనుకుని, నా నోట్లోని ఫలాలను పక్కన పెట్టి ఆ గోరుని తీసుకొచ్చాను. మర్నాడు పొద్దున చూస్తే అది మామూలు గోరే. మీకు గుర్తుందో లేదో ఆ రోజు మీరు బాగా గుణీసి చివరికి ముక్కుతో నన్నొక పోటుపొడిచారు” అని జరిగిందంతా గుర్తుచేసింది.
సురేద్రుడు “అవును! నాకిప్పుడు గుర్తొచ్చింది. విన్నారు కదా స్వామీ, ఈ చిలుక చెప్పిన దంతా నిజం” అని చెప్పాడు.
"నాకు జరిగిందంతా చెప్పారు కాబట్టి మీరే అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తే మీ అంత మంచివాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి దయచేసి చెప్పండి” అని తంత్రలోహనుడు బ్రతిమాలాడు.
అప్పుడు చిలుకల రాజు సురేంద్రుడు “పుణ్యాత్మా! ఇక్కడికి పది యోజనాల దూరంలో ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టు ఆకాశంలోకి పెరిగినట్టుంటుంది. ఆ చెట్టుమీద గండబేరుండ పక్షులు నివసిస్తున్నాయి. నువ్వు ఎలాగైనా వాటి స్నేహాన్ని సంపాదించుకున్నావంటే, నీ పని జరిగవచ్చు” అని చెప్పాడు.
తంత్రలోహనుడు చిలకలకి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతను గండబేరుండ పక్షులు ఉండే చెట్టు దగ్గరకి వెళ్ళాడు. ఆ సమయంలో గూటిలో పిల్లపక్షులు మాత్రమే ఉన్నాయి. తల్లి పక్షీ, తండ్రి పక్షీ బయటికి వెళ్ళాయి. అవి రెండూ తిండి వెతుక్కుని తీసుకొచ్చేలోపల కృష్ణపాము పిల్లలను తినాలన్న ఆశతో చెట్టుమీదకు పాక సాగింది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన తంత్రలోహనుడు ఆ పాముని ఒక్క ఉదుటన తన కత్తికి బలిపెట్టాడు. ఆ సంఘటనతో పిల్లపక్షులు ఎంతో ఆనందంతో అతనికి ధన్యవాదాలు చెప్పి అతనికి తమూ, తమ తల్లి దండ్రులూ ఏదైనా సహాయం చేస్తామని చెప్పాయి. కానీ అది తమ తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సమయం అవ్వటం వల్ల దూరంగా చెట్టు క్రింద కూర్చోమని చెప్పాయి. అతను అలాగే చేసాడు. రెండు నిమిషాలకు ఆ పిల్లల అమ్మానాన్నా వచ్చాయి. పక్షి పిల్లలు జరిగిందంతా చెప్పాయి. వెంటనే గండబేరుండాలు తంత్రలోహనుడి దగ్గరికి వెళ్ళి “మీరు మా పిల్లలను కాపాడినందుకు ధన్యవాదాలు. మేము మీకు చేయగలిగిన సహాయమేదైనా ఉందా స్వామీ?” అని అడిగాయి.
తంత్రలోహనుడు తన కధ మొత్తం చెప్పాడు. తను వాటి నుంచీ కోరుకుంటున్న సహాయం యేమిటో కూడా చెప్పాడు. వెంటనే మగపక్షి అతన్ని తనపైన ఎక్కించుకొని తన వాళ్ళకి వీడ్కోలు చెప్పి బయలుదేరింది. దారిలో నవరత్న ద్వీపం మీదుగా వెళుతున్నపుడు తంత్రలోహనుడు తనని దించమని అడిగాడు. అక్కడ ఎన్నో నవరత్నాలని మూటకట్టుకుని మళ్ళీ పక్షి మీద బయలుదేరాడు. అతన్ని మల్లికా ద్వీపంలో దించి, అతనికి ఒక ఈకని ఇచ్చి “ఈ ఈకని గనకా తగలబెట్టారంటే నేను మరుక్షణంలో మీ ఎదుటకి వస్తాను” అని చెప్పి వెళ్ళీపోయింది.
తంత్రలోహనుడు రత్నాల వ్యాపారిని అంటూ ఒక దుకాణం అద్దెకి తీసుకుని, చాలా చౌకగా రత్నాలు అమ్మాడు. ఊరిలోని అందరూ కూడా అతని దెగ్గర రత్నాలు కొనడానికి వచ్చారు. అందరిలాగానే నవకోటి నారాయణ శెట్టి అనే ఒక శెట్టి కూడా వచ్చాడు. అతను ఆ ఊరిలోని గొప్ప ధనవంతుడు. ఆ ఊరిలో అతనికి మాత్రమే ఏడు అంతస్తుల భవనం ఉంది. ఈ విషయం తెలుసుకున్న తంత్రలోహనుడికి అతను తను కలవాలనుకుంటున్న అమ్మాయి తండ్రి అయ్యుండచ్చు అని అనుకున్నాడు. నిజానికీ నారాయణ శెట్టి కూతురి గోరే చిలుకలు తెచ్చింది. ఆమె బొమ్మే గుళ్ళో ఉన్నది కూడా. ఆమె పేరు సంగీత సాహిత్య సరసోల్లాస హాసినీ. సౌందర్యంలో ఆమె దేవతలకంటే కూడా ఎంతో బాగుంటుంది.
తంత్రలోహనుడు తన పేరు భైరవ లింగశెట్టి అని తను దేశపర్యాటన చేస్తూ రత్నాలు అమ్ముకుంటూ తిరుగుతున్నానని అందరికీ చెప్పుకున్నాడు. తంత్రలోహనుడితో నారాయణశెట్టికి మంచి స్నేహం ఏర్పడింది. తంత్రలోహనుడిని తన ఇంట్లో బస చేయటానికి నారాయణ శెట్టి కోరాడు. తంత్రలోహనుడు అందుకు సరే అన్నాడు. వాళ్ళింటిలో ఉంటూ సంగీత సాహిత్య సరసోల్లాస హాసినితో తంత్రలోహనుడికి పరిచయం ఏర్పడింది. శెట్టి కూతురు ఐన ఆమెకి కూడా తంత్రలోహనుడి పైన సద అబిప్రాయం కలిగింది.
ఒక రోజు తంత్రలోహనుడు “శెట్టి గారు! ఎన్నాళ్ళని నేను మీ ఇంట్లో ఉంటాను. రేపో, మాపో నేను నా భార్యని తీసుకురావాలనుకుంటున్నాను. కనుక మీ ఇంటి ఎదురుగా ఉన్న స్ధలాన్ని నాకు ఇవ్వండి నేను ఒక ఇల్లు కట్టుకుంటాను. నేను ఈ ఊరును వదిలి వెళ్ళే టప్పుడు మీకే ఆ ఇంటిని కూడా ఇచ్చేస్తాను” అని అన్నాడు. నారాయణ శెట్టి అందుకు ఒప్పుకున్నాడు.
తంత్రలోహనుడు అక్కడ ఇల్లు కట్టించేటప్పుడు కొంతమంది నమ్మకస్తులైన పని వాళ్ళతో ఆ ఇంటినుంచీ హాసినీ గదికి ఒక సొరంగం తవ్వించాడు. ఇల్లు కట్టడం పూర్తయ్యింది. తంత్రలోహనుడు గృహప్రవేశం చేశాడు.
ఒక రోజు రాత్రి తంత్రలోహనుడు హాసినీ గదిలోకి సొరంగం ద్వారా ప్రవేసించి ఆమెని ఒక కర్రతో తట్టి నిద్రలేపాడు. సహజంగా ధైర్యం కలిగినది, అతని మీద మంచివాడు అన్న ఉద్దేశంకూడా ఉంది కనుక ఆమె భయపడకుండా అతను ఎందుకు వాచ్చాడని అడిగింది. అతను తన కధ మొత్తం చెప్పి తరవాత ఏం జరగాలో కూడా చెప్పాడు. ఆమె అందుకు ఒప్పుకుంది.
మర్నాడు తంత్రలోహనుడు శెట్టి దగ్గరికి వెళ్ళి “శెట్టిగారూ నా భార్య రాత్రి ఊరినుండీ వచ్చిందండీ. కనుక ఈ రోజు మీరు మా ఇంట్లో విందు చేయాలి” అని చెప్పాడు. శెట్టి అందుకు ఒప్పుకున్నాడు. మద్యానం విందుకు వెళ్తూ శెట్టి కూతురుని రమ్మంటే “నాన్నా! నాకు చాలా తల నొప్పిగా ఉంది. నేను రాలేను కనుక మీరు వెళ్ళండి” అంటూ ఒకటే మూలిగింది. సర్లే అనుకుని శెట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరూ విందుకి వెళ్ళారు.
ఐతే హాసినీ సొరంగం ద్వారా ముందుగానే అక్కడికి చేరుకుని వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళకి అయోమయంగా అనిపించింది. అయితే తంత్రలోహనుడు “నా భార్య అచ్చం మీ కూతురిలాగానే ఉంది కదండీ!” అన్నాడు. కానీ శెట్టికి మాత్రం అనుమానంగానే అనిపించింది. `ఈమె నా కూతురే నేమోనని’ తెగ ఆలోచించాడు. కానీ తన అనుమానాన్ని బలపరిచేది ఏదీ దొరకక ఊరుకున్నాడు. అందరూ విందు చేస్తూ ఉండగా అతనికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అతను హాసినీ నెయ్యి వడ్డిసుండగా నెయ్యిని ఆమె చీరకొంగుపై పొరపాటున పోసినట్టుగా పోసాడు. అతని ఆలోచన ఏమిటో తంత్రలోహనుడికి అర్ధం అయ్యింది. అందరూ విందు అయ్యాక కబుర్లు చెప్పుకుంటుండగా తంత్రలోహనుడు ఎవరికీ తెలియకుండా పని వాడి చేత నెయ్యి మరక పడ్డ చీరలాంటి చీరే ఇంకోటి తెప్పించాడు.
శెట్టి ఇంటికి వెళ్ళేలోపలే హాసినీ ఇంట్లోకి వెళ్ళి మంచంమీద మూలుగుతూ పడుకుంది. “హాసినీ! ఒక సారి ఇలా రా తల్లీ!” అని శెట్టి పిలవగానే హాసినీ “నాన్నా! నేను రాగలిగే స్తితిలోలేను. నన్ను పడుకోనియ్యి నాన్నా!” అంటూ అంది గారాబంగా. “సరే. నువ్వు రా అక్కర లేదు కానీ తల్లి నీ వంటిమీద ఉన్న చీర ఇలా పంపించి నువ్వు ఇంకో చీర కట్టుకో తల్లి” అని శెట్టి చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాకపోతే నెయ్యి మరక పడ్డ చీరకు బదులు అలాగే ఉన్న ఇంకొక చీరను పంపించింది. చీర అంతా వెతికినా కూడా శెట్టికి నెయ్యి మరకలుగానీ, పోనీ ఆ నెయ్యిని కడిగేసిన నీటి తడిగానీ తగల్లేదు. దాంతో అతను ‘నేను నా కూతురిని అనవసరంగా అనుమానించాను’ అనుకున్నాడు.
కొన్నిరోజులు గడిచాయి. ఒక రోజు తెల్లవారు జామున తంత్రలోహనుడు శెట్టి ఇంటికి వచ్చి “శెట్టి గారూ! నేను ఇప్పుడు మా ఊరికి వేళ్ళాల్సిన పని పడింది. కనుక మీ దగ్గర సెలవు తీసుకుందాం అని వాచ్చాను” అన్నాడు.
శెట్టి అతని కుటుంబ సభ్యులందరూ తంత్రలోహనుడికి వీడ్కోలు ఇవ్వడానికి వెళ్ళారు. అయితే హాసినీని మాత్రం ఎవరూ నిద్రలేపలేదు. “ఇంత తెల్లవారుజామున ఆమెని నిద్రలేపకండి” అని తంత్రలోహనుడు అన్నాడు కనుక.
అయితే హాసినీ ఎప్పుడో నిద్ర లేచి తంత్రలోహనుడి ఇంటి దగ్గరికి వెళ్ళింది. శెట్టి మిగిలిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే వాళ్ళని తంత్రలోహనుడూ, హాసినీ ఊరి చివరి దాకా తీసుకువెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అలా ఊరి చివరి దాకా రాకపోతే ఇంటికి వెళ్ళగానే జరిగింది ఏమిటో అర్ధమైపోతుంది అప్పుడు హాసినీని వాళ్ళు తీస్కెళ్ళిపోతారు. అందుకని మాటల్లో పెట్టి వాళ్ళని ఊరి చివరికి తీసుకెళ్ళి “ఇక మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే చాలా దూరం వచ్చారు” అని తంత్రలోహనుడు అన్నాడు. వాళ్ళు వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంటే హాసినీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ వీడ్కోలు తీసుకుంది. వాళ్ళు ఆమెని ఓదార్చి వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళగానే తంత్రలోహనుడు గండబేరుండ పక్షి ఇచ్చిన ఈకని తగలబెట్టాడు. వెంటనే గండబేరుండ పక్షి వచ్చింది. ఇద్దరూ పక్షిమీద నిముషాలలో వాటి గూడు ఉన్న చెట్టు దగ్గరకి చేరుకున్నారు.
ఇక్కడ నారాయణ శెట్టి ఇంటికి వెళ్ళాక తన కూతురు ఇంట్లో లేకపోవడం గమనించుకున్నాడు. ఆమె గది తలుపుకు అవతల వైపున గడియపెట్టి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ తలుపు బద్దలు కొట్టి మరీ ఆమె గదిలోకి వెళ్ళగా అక్కడ ఆమె లేదు. బదులుగా గదిలో ఒక మూల సొరంగం కనిపించింది. వాళ్ళు ఆ సొరంగం ఎక్కడికి వెళ్తుందా అని దాన్లో ప్రయాణం చేయగా వాళ్ళు తంత్రలోహనుడు ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళ ఎదురింట్లో తేలారు. వెంటనే వాళ్ళకి జరిగిందంతా అర్ధమైంది. ఇప్పుడు రచ్చచేస్తే తము మోసపోయిన విధానాన్ని తెలుసుకుని జనాలు నవ్వుతారు అనుకుని వాళ్ళు మారు మాట్లాడలేదు.
తంత్రలోహనుడు గండబేరుండ పక్షులు అతన్ని తీసుకెళ్తాను అనగనే అతనేమి వెంటనే వెళ్ళిపోలేదు. తన గుర్రాన్ని తీసుకెళ్ళి దగ్గరలోని ఊరిలో ఒకళ్ళకి డబ్బులిచ్చి తన గుర్రం బాద్యత అప్పగించి వాచ్చాడు. ఇప్పుడు హాసినీని ఆ ఊరిలోని గుర్రం తీసుకొచ్చి ఆమెని దాని మీద తీసుకెళ్ళాడు. అలా వాళ్ళు గుడి దగ్గరకి వెళ్ళారు.
తంత్రలోహనుడు “ఓ లలనామణీ! ఈ గుడిలో ఉత్తరదిశలో నీ బొమ్మ ఉంటుంది. అక్కడ నా స్నేహితుడు పిచ్చివాడిలాగా బ్రతిమాలుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఆ బొమ్మ పక్కన నించోని అతని మెడలో ఈ పూల మాలని వెయ్యి. కానీ అతను నా గురించి అడిగితే మాత్రం నేను చనిపోయానని చెప్పు. ఎందుకంటే నేను అతని మీద ప్రేమతో ఇంత శ్రమ తీసుకుని నిన్ను తీసుకొచ్చాను. అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోవాలి” అని చెప్పాడు.
ఆమె సరే నని లోపలికి వెళ్ళింది. ఆమె తంత్రలోహనుడు చెప్పినట్టుగానే చేసింది. కానీ తంత్రలోహనుడు చనిపోయాడని తెలుసుకోగానే మదనమోహనుడు ఒరలోంచి బాకు తీసి ఆత్మహత్యచేసుకున్నాడు. అది చూసి ‘అయ్యో నేను వరించిన వ్యక్తి చనిపోయాడు. ఇతని కోసం నేను నా సర్వస్వాన్ని త్యాగం చేసుకుని వాచ్చాను. నా కిప్పుడు దారేది’ అని ఆలోచించి హాసినీ కూడా ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ గుడిలోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకపోయేసరికి తంత్రలోహనుడు గుడిలోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ‘అయ్యో! ఇదంతా నా వల్లే కదా’ అని యోచించి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి వాళ్ళందరూ అక్కడ చనిపోయి ఉండడం చూసి మనసు విరిగి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భక్తులు అది చూసి దేవుడి దగ్గరకి వెళ్ళి “దేవుడా! నీ గుడిలో నలుగురు చనిపోయి ఉంటే కూడా కదలక మెదలకా ఉంటావా? వాళ్ళని బ్రతికించనన్నా బ్రతికించు లేదా మా ప్రాణాలను కూడా అర్పిస్తాము” అంటూ దేవుణ్ణి ప్రార్ధించారు. దానితో దేవుడు నలుగురినీ బ్రతికించాడు” అంటూ తెరగుడ్డ కధ పూర్తి చేసి....
(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)