జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల పార్కు ఉంది. ఆ పార్కు ఇళ్ళ మధ్య ఉండేది. పిల్లలు పార్కులో ఆడుకోవడానికి టిక్కెట్టు కొనుక్కొనాలి. తల్లిదండ్రులు కూడా ‘పిల్లలు హోంవర్కు పూర్తి చేస్తే పార్కు టిక్కెట్టు కొనిపిస్తాము’ అనేవాళ్ళు. దాంతో పిల్లలు తొందరగా హోంవర్కు ముగించుకొని, గబగబా పార్కుకి పరుగెత్తేవాళ్ళు.
ఆ పార్కులో ఒక తోటమాలి తాత ఉండేవాడు. ఆ తాత చాలా మంచి వాడు. ఒక రోజు రవి ఆడుకోవటానికి వచ్చాడు అక్కడికి. కొత్తకదా, అందుకని జారుడు బండ జారడానికి చాలా భయపడ్డాడు అతను. అప్పుడు తోటమాలి తాత "భయపడకు బాబూ! ఇది చాలా సులభం" అంటూ ధైర్యం చెప్పాడు. సహజంగానే అటుపైన రవికి జారుడు బండ అంటే భయం పోయింది. అప్పటి నుండి రవి రోజూ తాత దగ్గరికి వచ్చి, కొంచెం సేపు కబుర్లు చెప్పిగానీ ఇంటికి వెళ్ళేవాడు కాదు.
ఇలా ఉండగా ఒక రోజు రవికి ఒక కొత్త సంగతి తెలిసింది: తాత యజమాని తాతకు సరిగా జీతం ఇవ్వట్లేదు. తాతను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ విషయం తెలియగానే రవికి చాలా బాధ వేసింది. 'తాతకి ఎలాగైనా సహాయం చేయాలి' అనుకున్నాడు.
పార్కు యజమాని రోజూ టిక్కెట్టు కౌంటరు దగ్గర కూర్చుంటాడు. అతన్ని చూసాక, రవికి ఒక ఉపాయం తట్టింది. అతను తన స్నేహితులందరినీ పిలిచి విషయమూ, తన ఉపాయమూ చెప్పాడు. పిల్లలందరూ 'సరే' అన్నారు. రవి తాతను పిలిచి, తను చెప్పినట్లు చేయమన్నాడు. తాత ముందు కొంచెం తటపటాయించాడు; కానీ చివరికి సరేననక తప్పలేదు.
ఆ రోజు పార్కు తెరిచే సమయానికి, పార్కు యజమాని సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, తన జీతం పెంచమని అడిగాడు తాత. సుబ్బారావు కుదరదన్నాడు. వెంటనే తాత తను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పేశాడు. నెలాఖరుకు వచ్చి చేసినంత వరకు జీతం తీసుకువెళతానని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రోజు సాయంత్రం, ముందుగా రవి పార్కుకు వెళ్ళి టిక్కెట్టు తీసుకుని లోపలికి వెళ్ళి, వెనక్కి తిరిగి వచ్చేసాడు. అటుపైన ఒకరి తరవాత ఒకరుగా పిల్లలందరూ వచ్చారు. రవి వాళ్ళందరికి ఏదో చెప్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి పిల్లలంతా వెళ్ళిపోయారు.
ఇదంతా చూసి పార్కు యజమాని సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఏం జరుగుతున్నదో అతనికి అర్ధం కాలేదు. మరుసటి రోజు కూడా ఇలాగే జరిగింది. కాకపోతే పిల్లలు ఈ రోజు వెళ్ళిపోలేదు- సుబ్బారావు దగ్గరకు వచ్చి "తాత ఏడి, కనిపించటం లేదు?" అని అడిగారు.
సుబ్బారావు ఆశ్ఛర్యంగా వాళ్ళవైపు చూస్తూ "తాత పని మానేసాడు" అని చెప్పాడు. అంతే- మరుసటి రోజు నుండి పిల్లలు రావడం పూర్తిగా మానేసారు. కనీసం ఒకళ్ళు ఒక టిక్కెట్టు కూడా కొనడం లేదు.
ఇట్లా రెండురోజులు గడిచేసరికి, సుబ్బారావుకు బుద్ధి వచ్చింది. 'తాత లేకపోతే తనకు అసలు ఆదాయమే ఉండదు! తాత జీతం విషయంలో తను మరీ జిడ్డుగా ఉండకూడదు" అని అర్ధం అయ్యింది. ఇంకో రెండు రోజులు ఇట్లా గడిచింది- తాతను పిలిపించి, జీతం పెంచి మరీ పనిలో చేర్చుకున్నాడు సుబ్బారావు.
పిల్లలు, తాత కూడా సంతోష పడ్డారు. పార్కు మళ్ళీ పిల్లలతో కళకళలాడింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్లు:
బావుంది. చిన్న పిల్లల కదే అయినప్పటికీ చెప్పిన విధానం బావుంది. నేనూ మల్లాది, మధుబాబు అభిమానినే.
బావుంది. చిన్న పిల్లల కదే అయినప్పటికీ చెప్పిన విధానం బావుంది. నేనూ మల్లాది, మధుబాబు అభిమానినే.
మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
http://donotkeepyourself.blogspot.com/
కామెంట్‌ను పోస్ట్ చేయండి