(నిన్నటి కధ తరువాయి భాగం)
తెరగుడ్డ కధ అంతా చెప్పి, "ఓ రాజశ్రేష్ఠా! ఈ నలుగురిలో ఎవరు చనిపోవడం గొప్ప విషయం?” అని అడిగాడు.
ఆ ప్రశ్నకి విక్రమార్కుడు “ఓ తెరగుడ్డా! తంత్రలోహనుడు చనిపోవడమే గొప్ప విషయం” అని చెప్పాడు. ఎందుకంటే విక్రమార్కుడు పలుకని పడంతిని మాట్లాడించాలి కదా! అందుకని కావాలనే జవాబు తప్పుగా చెప్పాడు. ఎందుకంటే అలా తప్పుగా చెప్పాడనుకో అప్పుడు అంత సేపు కధ విన్నది కాబట్టి పలుకని పడంతి తను మాట్లాడకూడదు అని మర్చిపోయి ‘సరైన జవాబు అది కాదు. ఇది’ అంటూ కోపంగానైనా సరే సరైన జవాబు చెపుతుందని విక్రమార్కుడి ఉద్ధేశం.
ఆయన ఉద్ధేశం నిజం చేయటానికే అన్నట్టు, పలుకని పడంతి “ఏమిటీ? ఎవరు చనిపోయినది గొప్ప అన్నారు? మీరు చెప్పింది శుధ్ద తప్పు. పూజారి చనిపోయినదే గొప్ప. ఎందుకంటే పూజారికి ఏ సంబంధం లేక పోయినా అతను అంత మంది చనిపోయి ఉండటం భరించలేక చనిపోయాడు. కనుక అతను చనిపోయిందే గొప్ప” అని అన్నది.
"ఔనౌను! నువ్వు చెప్పిందే నిజం. నాది శుధ్ద తప్పు జవాబు” అన్నాడు విక్ర మార్కుడు.
కొంచెం సేపు అయ్యాక విక్రమార్కుడు ఈ సారి పలుకని పడంతి ధరించిన రవికను ఉధ్దేశించి “ఓ రవికా! నువ్వు కూడా ఏదైనా కధ చెప్పవా? నాకేమో నిద్ర రావడం లేదు. పలుకని పడంతేమో మాట్లాడదు. పొద్దేమో గడవదు. కాబట్టి నువ్వన్నా ఏదైనా కధ చెప్తే పొద్దుపోతుంది” అన్నాడు.
వెంటనే భేతాళుడు రవికలో ప్రవేశించాడు. “ఓ రాజా! కధ, కధ అని ఓ బాధిస్తున్నారు. నేను కధ చెప్పగలిగే స్థితిలో లేను. ఈ చిన్నదేమో నన్ను బిగించి కట్టింది. అసలే నాకు ఊపిరాడడం లేదు. ఇక మీకు ఎం కధ చెప్పమంటావయ్యా?” అని అన్నాడు రవికలోని భేతాళుడు.
వెంటనే పలుకని పడంతి ఒక గదిలోకి వెళ్ళి తను ధరించిన రవికని తీసి ఇంకొక రవిక ధరించింది. ఈ మునుపటి రవికని విక్రమార్కుడికీ తనకీ మధ్యలో పెట్టి, మాట్లాడకుండా కూర్చుంది.
విక్రమార్కుడు “ఓ రవికా! పలుకని పడంతి ఎంత దయాళువో చూడు. నీ మీద కరుణతో నిన్ను విడిచి పెట్టింది. ఇప్పటికన్నా కధ చెప్పు” అన్నాడు.
మతిమంతుడూ మంత్రమనోరమ
అప్పుడు రవిక “ఓ రాజేంద్రా! ఒక చక్కని కధ చెప్తాను వినండి.
రంగనాధ పురం అనే ఒక దేశం ఉందేది. ఆ దేశాన్ని రంగనాధుడనే రాజు పాలించేవాడు. అతనికి సంబ్రమవర్మ అనే మంత్రి ఉన్నాడు.
ఈ రాజుకూ మంత్రమనోరమ అనే కూతురు పుట్టింది. మంత్రికి కూడా మతిమంతుడు అనే కొడుకు పుట్టాడు. ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.
యుక్తవయసుకి వచ్చేసరికి మనోరమకీ మతిమంతుడికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం పెరిగింది. అందువల్ల ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలి అనుకున్నారు. కానీ రంగనాధుడు `రాజుకూతురు అయ్యుండీ మనోరమ రాజు క్రింద వాడయిన మంత్రి కొడుకుని పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోడని’ తెలుసుకుని మతిమంతుడూ, మనోరమా దేశాంతరాలకు వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నారు.
కొన్నాళ్ళు బాగానే గడిచాయి. ఇంతలో మనోరమ గర్భవతి అయ్యింది. ఆమెకి నెలలు నిండాయి.
మతిమంతుడు “మంత్రసానిని తీసుకు వస్తాను” అని చెప్పి వెళ్ళాడు.
అతను మంత్రసాని ఇల్లేదో తెలుసుకుని ఆమె ఇంటికెళ్ళాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో అరుగు మీద కూర్చుని ఎదురు చూడ సాగాడు.
అయితే ఆ మంత్రసాని ఇంటి ఎదురు ఇంట్లో ఒక నర్తకీ నివసిస్తుంది. ఆ నర్తకీ ఇతనిని చూసి ‘ఆహా! ఎవరితను? ఎంత అందంగున్నాడు!’ అని అనుకుంది. మరుక్షణమే మతిమంతుడి దగ్గరకెళ్ళి “ఆర్యా! తమరు ఎవరి కోసం ఇక్కడ ఎదురుచూస్తున్నారు? అసలు తమ కధ ఏమిటి?" అని అడిగింది. మతిమంతుడు తన సంగతి అంతా చెప్పాడు.
అంతా విన్న ఆ నర్తకీ “ఈ ఎండలో ఎందుకు కూర్చోవడం. నా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఈ లోపల నేను ఆ మంత్రసానిని పిలిపిస్తాను” అని చెప్పి అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తివాచీ మీద కూర్చో పెట్టింది.
"మంత్రసానికి కబురు పెట్టాను వచ్చేస్తుంది. ఈ లోపల భోజనం చేయండి” అని చెప్పి అతని చేత బలవంతానా భోజనం చేయింపించి తాంబూలం ఇచ్చింది. కాకపోతే ఆ తాంబూలంలో మంత్రించిన మందు ఏదో కలిపి ఇచ్చింది. ఆ మందు కలిపిన తాంబూలం తినడం వల్ల మతిమంతుడు ఎనుబోతుగా మారిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి ఆమె తన గొడ్లపాకలో కట్టేసుకుంది.
(ఇంకాఉంది. మిగిలిన కధ తరవాత టపాలలో వ్రాస్తానూ.)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
very good chaalaa opikatO raastunnavammaa :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి